సింగపూర్‌లో ఇమ్మిగ్రేషన్ అధికారులు నాలుగు పిల్లిపిల్లల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల మలేషియా నుంచి సింగపూర్ వస్తున్న వాహనాలను బార్డర్ ఎంట్రీ దగ్గర తనిఖీలు చేస్తున్న అధికారులు.. అటుగా వస్తున్న ఓ వాహనాన్ని ఆపారు. దాన్ని కూడా చెక్ చేసిన అధికారులు.. అందులోని వ్యక్తిని కిందికి దిగమన్నారు. అతణ్ని చెక్ చేసి.. ఏమీ లేదనుకుని.. వెళ్లిపొమ్మని చెప్పారు. అయితే అప్పుడే షాకవడం అధికారుల వంతైంది. వెళ్లిపోమన్నారు కదా.. అని వెళ్లబోయాడా వ్యక్తి. ఇంతలో అతని ప్యాంటులో నుంచి ‘మ్యావ్.. మ్యావ్..‘ అంటూ శబ్దాలు వినిపించాయి.
అతని ప్యాంటు లోపల నుంచి వస్తున్న వింత శబ్దాలతో షాకైన అధికారులు అతణ్ని ఆపి.. ప్యాంటులోపల ఏం దాచావో చూపమంటూ గద్దించారు. దీంతో ఆ వ్యక్తి ప్యాంటులోపల నుంచి పిల్లిపిల్లలను ఒక్కొక్కటిగా బయటకు తీయడం చూసి ఆశ్చర్యపోవడం అధికారుల వంతైంది. ఈ 45 ఏళ్ల సింగపూర్ వ్యక్తి మొత్తంగా 4 పిల్లి పిల్లలు ప్యాంటులో నుంచి బయటకు తీశాడు. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అతను మలేషియా నుంచి పిల్లిపిల్లల్ని అక్రమంగా తీసుకొస్తున్నట్టు గుర్తించారు. అయితే ఈ పిల్లి పిల్లల్ని ఆ వ్యక్తి ఎందుకు తీసుకెళ్తున్నాడనే విషయం తెలియరాలేదు. అయితే, ఇది స్మగ్లింగే అయితే.. ఇలాంటి స్మగ్లింగ్‌ను ఇప్పటివరకూ చూడలేదని చెప్పారు అధికారులు.
అయితే, సింగపూర్‌లోకి పిల్లులు, కుక్కలు వంటి పెంపుడు జంతువుల తీసుకురావాలంటే సవాలక్ష రూల్స్ ఉంటాయి. అందుకు అవసరమైన హెల్త్ సర్టిఫికెట్స్, లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. రేబిస్ వంటి వ్యాధులు ప్రబలకుండా.. సింగపూర్ ఇలాంటి కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. అందుకే, ఈ పిల్లిపిల్లల్ని ఆ వ్యక్తి దొంగతనంగా సింగపూర్‌లోకి తీసుకొచ్చి అమ్మేందుకు ప్రయత్నించినట్టు ఇమ్మిగ్రేషన్ అధికారులు భావిస్తున్నారు. అయితే, అతను చేసింది నేరమని తేలితే.. ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష, రూ. 10000 సింగపూర్ డాలర్లు జరిమానా విధిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Illegal immigration, Malaysia, Singapore