నడిరోడ్డుపై గొడ్డలితో నరికేశారు..జగిత్యాలలో పట్టపగలే దారుణం

దాడి సమయంలో అక్కడ చాలా మంది స్థానికులు ఉన్నా..ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. నిందితుడి చేతిలో గొడ్డలి ఉండడంతో భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొందరు ఘటనా స్థలంలోనే ఉన్నప్పటికీ చూస్తూ ఉండిపోయారు తప్ప.. ఆపే ప్రయత్నం చేయలేదు.

news18-telugu
Updated: April 15, 2019, 3:08 PM IST
నడిరోడ్డుపై గొడ్డలితో నరికేశారు..జగిత్యాలలో పట్టపగలే దారుణం
సీసీ ఫుటేజీ
  • Share this:
పట్టపగలే దారుణం..! నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఘోరం..! జగిత్యాల జిల్లా కేంద్రంలో పట్టపగలే నడిరోడ్డుపై ఓ వ్యక్తిని గొడలితో నరికేశారు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని అడ్డగించి మరీ దాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. అతన్ని కిందపడేసి గొడ్డలితో ఎడాపెడా దాడిచేశాడు. చుట్టూ చాలా మంది ఉన్నా ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. గొడ్డలి దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

వివరాల్లోకి వెళ్తే..జగిత్యాలలోని మార్కండేయ వీధికి చెందిన తిప్పర్తి కిషన్‌కు అనంతారం గ్రామానికి చెందిన లక్ష్మణ్ వ్యక్తితో భూ తగాదాలు ఉన్నాయి. ఈ గొడవల నేపథ్యంలో కిషన్‌పై లక్ష్మణ్ దాడిచేసినట్లు తెలుస్తోంది. ఆదివారం జగిత్యాల టవర్ సర్కిల్ ప్రాంతంలో కిషన్ ఉన్నాడని తెలుసుకున్న లక్ష్మణ్...గొడ్డలితో అక్కడికి వెళ్లి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడికి సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు సోమవారం బయటకు వచ్చాయి. ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితుడు లక్ష్మణ్ కోసం గాలిస్తున్నాయి

దాడి సమయంలో అక్కడ చాలా మంది స్థానికులు ఉన్నా..ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. నిందితుడి చేతిలో గొడ్డలి ఉండడంతో భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొందరు ఘటనా స్థలంలోనే ఉన్నప్పటికీ చూస్తూ ఉండిపోయారు తప్ప.. ఆపే ప్రయత్నం చేయలేదు. కిషన్‌పై దాడిచేసిన తర్వాత లక్ష్మణ్ అక్కడి నుంచి బైక్‌పై వెళ్లిపోయాడు. అనంతరం స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. పోలీసులు చేరుకొని బాధితుడు కిషన్‌ను ఆస్పత్రికి తరలించారు. కాగా, కొన్ని రోజుల క్రితం ఈ తరహా ఘటనలు తెలంగాణలో ఎక్కువగా జరిగాయి. హైదరాబాద్‌లోని సరూర్ నగర్, అత్తాపూర్‌లో పట్టపగలే కత్తులు, గొడ్డళ్లతో దాడులు జరగడం సంచలనం రేపాయి.

సీసీ టీవీ దృశ్యాలు:


First published: April 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు