మొబైల్ ఫోన్లను మీ పిల్లలకు ఇవ్వొద్దు అని నిపుణులు హెచ్చరిస్తున్నా తల్లిదండ్రులు వినడం లేదు. అది పిల్లల ఆరోగ్యానికే గాక తండ్రుల ఆస్తులకు ప్రమాదం. అదెలా..?
సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకూ శృతి మించుతున్నాయి. అమాయకుల అవసరాన్ని, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని సైబర్ దొంగలు రెచ్చిపోతున్నారు. ఈ తరహా ఘటన రోజుకొకటి చొప్పున వెలుగు చూస్తున్నా.. పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నా.. వినియోగదారులలో మాత్రం అవగాహన పెరగడం లేదు. మహారాష్ట్రలో ఒక బాలుడు తన తండ్రి ఫోన్ వాడుతుండగా.. సడెన్ గా ఒక ఆగంతకుడు ఫోన్ చేసి.. ఫోన్ లో బాలుడితో యాప్ ఇన్స్టాల్ చేయించి.. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ. 9 లక్షలు నొక్కేశాడు. దీంతో ఆ తండ్రి లబోదిబోమంటున్నాడు. ఇంతకీ ఏమైందంటే..?
మహారాష్ట్రలోని నాగపూర్ లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. నాగపూర్ లోని కోరాడి ప్రాంతానికి చెందిన అశోక్ మన్వతే కు 15 ఏళ్ల కొడుకు ఉన్నాడు. సదరు బాలుడు తండ్రి ఫోన్ వాడుతున్నాడు. ఆన్ లైన్ క్లాసులు నడుస్తుండటంతో ఫోన్ నిత్యం ఆ బాలుడి వద్దే ఉంటుంది. గత బుధవారం గుర్తు తెలియని వ్యక్తి ఒకరి నుంచి ఆ బాలుడికి కాల్ వచ్చింది. తాను డిజిటల్ పేమెంట్స్ కు చెందిన ఒక సంస్థకు చెందిన ఎగ్జిక్యూటివ్ నని అవతలి వ్యక్తి చెప్పుకున్నాడు. మన్వతే బ్యాంకు ఖాతాకు ఈ ఫోన్ లింక్ అయి ఉందని.. అందులో ఒక యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని బాలుడిని మాటల్లో పెట్టాడు. ఆ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే.. క్రెడిట్ లిమిట్ పెరుగుతుందని బాలుడిని నమ్మించాడు.
ఇది నమ్మిన ఆ బాలుడు.. మోసగాడు పంపిన లింక్ ను ఓపెన్ చేశాడు. అంతే.. ఆ మరు క్షణమే మోసగాడు మన్వతే ఫోన్ ను యాక్సెస్ చేశాడు. మన్వతే బ్యాంకు ఖాతా నుంచి రూ. 8.95 లక్షలను స్వాహ చేశాడు. ఇది తెలుసుకున్న మన్వతే కు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తాను డబ్బు డ్రా చేయలేదు.. కానీ బ్యాంకు నుంచి నగదు కట్ అయినట్టు వస్తుండటంతో లబోదిబోమంటూ మొత్తుకుంటూ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు విషయం ఆరా తీయగా.. అసలు విషయం తెలిసింది.
కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ ప్రారంభించారు. బాలుడికి కాల్ చేసిన నెంబర్ కు తిరిగి కాల్ చేయగా.. అది పదే పదే స్విచ్చాఫ్ వస్తుంది. అయితే.. డబ్బు ఏ ఖాతాలోకి వెళ్లిందో గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. త్వరలోనే ఆ మోసగాడిని పట్టుకుంటామని తెలిపారు.
Published by:Srinivas Munigala
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.