భువనేశ్వర్: ఒడిశా రాజధాని భువనేశ్వర్ పరిధిలోని భీమతంగిలో వివాహిత హత్య ఘటన కలకలం రేపింది. ఓ వివాహితను, ఆమె మూడేళ్ల బాబును హతమార్చేందుకు ఆమె ప్రియుడే ప్రయత్నించాడు. ఆ పిల్లాడు ఇంట్లో లేకపోవడంతో తన ప్రియురాలిని హతమార్చాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం నిందితుడు ప్రాణాపాయం నుంచి బయటపడి కోలుకుంటున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. జాజ్‌పూర్‌కు చెందిన జగన్నాథ్ ప్రదాన్‌కు, ప్రియాంక ప్రియదర్శిని సాహూకు కొన్నేళ్ల క్రితమే పరిచయం ఉంది. ప్రియాంకకు పెళ్లి కాక ముందు నుంచే జగన్నాథ్‌తో పరిచయం ఉంది. కానీ.. వారి పరిచయం, ప్రేమ.. పెళ్లి వరకూ వెళ్లలేదు. ప్రియాంకకు 2014లో రాకేష్ సాహూతో వివాహమైంది. వీరికి మూడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. భువనేశ్వర్‌లోని భీమతంగి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఈ కుటుంబం నివాసం ఉంటోంది. రాకేష్ యూరేకా ఫోర్బ్‌లో పనిచేసేవాడు.
ఈ క్రమంలోనే.. ఇంటి వద్దే ఉండే ప్రియాంకకు.. జగన్నాథ్ ప్రదాన్‌తో ఉన్న పాత పరిచయం మళ్లీ చిగురించింది. ప్రియాంక గత మూడు నెలలుగా భర్తకు తెలియకుండా అతనితో వాట్సాప్‌లో, ఫేస్‌బుక్‌లో చాట్ చేస్తోంది. అయితే.. ఆ సంభాషణలను ఎప్పటికప్పుడు వాట్సాప్‌లో డిలీట్ చేస్తూ జగన్నాథ్ ప్రదాన్, ప్రియాంక జాగ్రత్త పడేవారు. ఇలా ఒకరికొకరు టచ్‌లో ఉన్న ఈ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ రాకేష్ ఇంట్లో లేని సమయంలో ప్రియాంకను, ఆమె కొడుకును చంపేందుకు జగన్నాథ్ ప్రదాన్ పక్కా ప్లాన్ వేశాడు.
అనుకున్నట్టుగానే ప్రియాంక ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో రాకేష్, ఆ మూడేళ్ల బాబు కూడా ఇంట్లో లేడు. దీంతో.. ప్రియాంకను గొంతు కోసి చంపిన జగన్నాథ్ ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు యత్నించాడు. అయితే.. ఈలోపు ప్రియాంక భర్త నంబర్‌కు వాట్సాప్‌లో వీడియో కాల్ చేశాడు. అయితే.. ఆ కాల్ లిఫ్ట్ చేసిన రాకేష్ మాట్లాడే లోపే కట్ అయిపోవడంతో తన ఇంట్లో నుంచే కాల్ వచ్చినట్టు గుర్తించి ఇంటి ఓనర్‌కు ఫోన్ చేసి ఒక్కసారి తన ఇంట్లోకి వెళ్లి చూడాలని చెప్పాడు. రాకేష్ ఇంటి యజమాని, అతని కొడుకు వెళ్లి చూడగా లోపల నుంచి లాక్ చేసి ఉంది. తలుపులు బద్ధలు కొట్టి చూడగా.. రక్తపు మడుగులో ప్రియాంక విగతజీవిగా కనిపించింది. జగన్నాథ్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఇద్దరూ వేర్వేరు గదుల్లో కనిపించారు.
ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా ప్రియాంక చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. ప్రియాంకను, ఆమె కొడుకును చంపేస్తానని జగన్నాథ్ రాసిన నోట్ ఒకటి పోలీసులకు దొరికింది. హత్య జరిగిన సమయంలో ఇంటి ఓనర్ ఇంట్లో ఆ పిల్లాడు ఆడుకుంటూ ఉండటంతో అదృష్టవశాత్తూ ప్రాణాలు దక్కాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జగన్నాథ్ ప్రదాన్ రెండుమూడు రోజుల్లో కోలుకునే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. జగన్నాథ్‌కు, ప్రియాంకకు మధ్య జరిగిన చాట్ తాలూకా వివరాల బ్యాకప్ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నిందితుడు కోలుకుని వాంగ్మూలం ఇస్తే ప్రియాంక హత్య కేసులో మిస్టరీ వీడుతుందని పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhuvaneshwar, Brutally murder, Lovers, Odisha