హోమ్ /వార్తలు /క్రైమ్ /

శంకర్ హత్య కేసు.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు... పోరాటం ఆగదన్న కౌసల్య...

శంకర్ హత్య కేసు.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు... పోరాటం ఆగదన్న కౌసల్య...

శంకర్ హత్య కేసు.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు... పోరాటం ఆగదన్న కౌసల్య... (File - credit - twitter)

శంకర్ హత్య కేసు.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు... పోరాటం ఆగదన్న కౌసల్య... (File - credit - twitter)

మన తెలుగు రాష్ట్రాల్లో అమృత-ప్రణయ్ హత్య కేసు ఎలాంటిదో... శంకర్ హత్య కేసూ అలాంటిదే. హైకోర్టు తీర్పు హాట్ టాపిక్ అయ్యింది.

  2016 నాటి శంకర్ పరువు హత్య కేసులో... తమిళనాడు మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన దోషి... కౌసల్య తండ్రి అయిన చిన్నస్వామికి ట్రయల్ కోర్టు విధించిన మరణశిక్షను రద్దు చేసిన హైకోర్టు... ఆయనపై ఉన్న అన్ని అభియోగాలనూ రద్దు చేసి... ఆయన్ను నిర్దోషిగా తేల్చింది. అలాగే... ఈ కేసులో మరణశిక్షను ఎదుర్కొంటున్న మరో ఐదుగురు దోషులకు మరణశిక్షను తగ్గించి... 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తమిళనాడులో జరిగిన ఈ శంకర్ పరువు హత్య కేసు... తెలంగాణలో జరిగిన అమృత-ప్రణయ్ హత్య కేసు లాంటిదే. హైకోర్టు తీర్పుపై న్యాయ పోరాటం చేస్తానని తన తల్లిదండ్రులకు మరణశిక్ష పడేలా చేస్తానని శంకర్ భార్య కౌసల్య తెలిపారు.

  శంకర్, కౌసల్య... ప్రేమించుకున్నారు. ఇది కౌసల్య తండ్రికి నచ్చలేదు. నీకేం తక్కువ... మన స్థాయికి తగిన వాణ్ని ఇచ్చి అట్టహాసంగా పెళ్లి చేస్తా అంటూ కూతుర్ని తన దారికి తెచ్చుకోవాలని యత్నించాడు. అందుకు మేజరైన కౌసల్య ఒప్పుకోలేదు. శంకర్ తోనే తన పెళ్లి జరగాలని పట్టుపట్టింది. అదే సమయంలో కౌసల్య తల్లి కూడా తండ్రి మాట విను అంటూ... కూతుర్ని గద్దించింది. దాంతో... పెద్దల్ని ఎదిరించి... శంకర్, కౌసల్య పెళ్లి చేసుకున్నారు. ఆ విషయం తెలిసిన చిన్నస్వామి... ఆగ్రహావేశాలతో రగిలిపోయారు.

  2016 మార్చి 13న మారణాయుధాలతో వచ్చిన ఓ గ్యాంగ్... తిన్నగా... ఓ షాపింగ్ మాల్ దగ్గరున్న శంకర్‌, కౌసల్య జంట దగ్గరకు వెళ్లింది. క్షణాల్లో కత్తులతో దాడి చేసింది. తిరుపూర్ జిల్లాలోని... ఉదుమల్‌పేటలో ఓ షాపింగ్ కాంప్లెక్స్ ముందు ఈ దాడి జరిగింది. తీవ్ర గాయాలతో శంకర్ అక్కడికక్కడే చనిపోగా... తీవ్ర గాయాలతో కౌసల్య... మృత్యువుతో పోరాడి... గెలిచింది. ఈ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. పరువు హత్యలపై మరోసారి చర్చకు తెరతీసింది.

  ఈ కేసులో పోలీసులు 11 మందిని అరెస్టు చేశారు. వారిలో కౌసల్య తండ్రి చిన్నస్వామి (43), తల్లి అన్నలక్ష్మి (38) కూడా ఉన్నారు. ఏడాది తర్వాత 2017 డిసెంబర్ 12న ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చింది. చిన్నస్వామితోపాటూ... మరో ఐదుగురికి ఉరిశిక్ష విధించింది. ఐతే... ట్రయల్ కోర్టు... అన్నలక్ష్మిని నిర్దోషిగా తేల్చింది.

  తాజాగా... మద్రాస్ హౌకోర్టు... చిన్నస్వామిని నిర్దోషిగా తేల్చడంపై ఇప్పుడు తమిళనాడులో చర్చ మొదలైంది. ఈ తీర్పును నెటిజన్లు వ్యతిరేకిస్తున్నారు. అంత దారుణంగా హత్య చేస్తే... అందుకు కారణమైన తండ్రిని నిరపరాధి అని కోర్టు చెప్పటమేంటని భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కౌసల్య ఇక సుప్రీంకోర్టు మెట్లెక్కే అవకాశం ఉంది. తన తల్లిదండ్రులకు శిక్ష పడే వరకూ తన పోరాటం ఆగదని ఆమె తెలిపారు.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Honor Killing, Madras high court