మధ్యప్రదేశ్‌లో అతని పేరు కాంతిలాల్ సింగ్.. స్థానికంగా కాంతు అని పిలుస్తారు. వయసు 30 ఏళ్లు. ఓ గ్యాంగ్ రేప్ కేసులో అతను రెండేళ్లు జైల్లో ఉన్నాడు. రెండు నెలల కిందట అతను నిర్దోషి అని కోర్టు తేల్చింది. దాంతో అతన్ని రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ బాధితుడు రాట్లాం జిల్లాలోని కోర్టుకు వెళ్లాడు. తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించి.. జైలుపాలు చేసినందుకు తనకు రూ.10,006.02 కోట్లు పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
ఇద్దరు పిల్లల తల్లిని ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారంటూ 2018లో రాట్లాం జిల్లాలోని బజ్నా పోలీసులు కేసు రాశారు. నిందితుల పేర్లలో కాంతిలాల్ పేరును చేర్చారు. ఇద్దర్ని అరెస్టు చేశారు. దాంతో కాంతిలాల్ తన ఇంటి నుంచి పారిపోయాడు. పోలీసులకు దొరకకూడదనే ఉద్దేశంతో తరచూ వేర్వేరు ప్రాంతాలకు మారుతూ ఉన్నాడు. చివరకు అతన్ని డిసెంబర్ 23, 2020న పోలీసులు అరెస్టు చేశారు. తాను నేరం చెయ్యలేదని చెప్పినా పోలీసులు వినలేదు. చివరకు అతన్ని అక్టోబర్ 22, 2022న నిర్దోషిగా విడుదల చేశారు. ఫలితంగా అతను చెయ్యని నేరానికి 666 రోజులు జైల్లో గడపాల్సి వచ్చింది.
కాంతిలాల్‌కి తల్లి, భార్య, ముగ్గురు పిల్లలున్నారు. వాళ్లంతా అతనిపైనే ఆధారపడి జీవించేవారు. అతని అరెస్టుతో ఆదాయమార్గం ఆగిపోయింది. ఆకలితో పస్తులున్నారు. ముగ్గురు పిల్లల చదువులూ ఆగిపోయాయి. అండర్ ట్రయల్ ఖైదీగా అతను నరకం చూశాడు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని కాంతిలాల్ అంటున్నాడు.
గ్యాంగ్ రేప్ కేసులో బాధితురాలి భర్త.. కాంతిలాల్‌పై ఆరోపణలు చేశాడు. అతనితోపాటూ మరో ఇద్దరు వ్యక్తులు, ముగ్గురు పోలీసులపైనా ఆరోపణలు చేశాడు. ఇప్పుడు కాంతిలాల్.. అతనిపై దావా వేశాడు. దాదాపు రెండేళ్ల జీవితకాలాన్ని పోగొట్టుకున్నందుకూ, ఆదాయం పోగొట్టుకున్నందుకూ, పరువు పోయినందుకూ, శారీరకంగా, మానసికంగా పొందిన అశాంతికీ, స్వేచ్ఛను కోల్పోయినందుకూ, ఫ్యామిలీకి దూరం అయినందుకూ తనకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు.
"ఈ పరిహారం చాలా పెద్దదిగా అనిపించవచ్చు. కానీ అతను అనుభవించిన వేదనతో పోల్చితే ఇది చిన్నదే. ఈ రోజుల్లో పెంపుడు జంతువులకు ఎంతో రక్షణ ఉంటోంది. కానీ మగవాళ్లకు ఇలాంటి కేసుల్లో రక్షణ లేదు. అన్యాయంగా ఇరికిస్తున్నారు" అని కాంతిలాల్ తరపు లాయర్ తెలిపారు. ఈ కేసుపై జనవరి 10న రాట్లాం జిల్లా, సెషన్స్ కోర్టులో విచారణ జరగనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Gang rape, Madhya pradesh