ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా మదనపల్లి జంట హత్యల కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కన్నకూతుళ్లను దారుణంగా హత్య చేసిన పురుషోత్తంనాయుడు, పద్మజ దంపతుల్లో ఉన్న మానసిక వ్యాధుల వ్యవహారం మిస్టరీగా మారింది. తిరుపతి రుయా వైద్యులు ఏమీ తేల్చలేకపోవడంతో వారికి మెరుగైన చికిత్స అందించేందుకు విశాఖపట్నంలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలకు తరలించారు. బుధవారం మదనపల్లి సబ్ జైలు నుంచి ప్రత్యేక వాహనంలో బయలుదేరిన పోలీసులు అర్ధరాత్రి సమయంలో అస్పత్రికి చేరుకున్నారు. అనంతరం ఓపీలో సంబంధిత ఫార్మాలిటీస్ పూర్తి చేసి మానసిక వైద్య శాలలో చేర్పించారు. ఆస్పత్రిలోని వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఇద్దర్నీ క్లోజ్డ్ వార్డులో విడివిడిగా ఉంచి చికిత్స అందించనున్నారు. అందులో ప్రత్యేకమైన బెడ్లును కూడా సిద్ధం చేశారు.
పద్మజ దంపతులిద్దరికీ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. మదనపల్లి సబ్ జైలుకు చెందిన సిబ్బంది చికిత్స పూర్తయ్యేంతవరకు ఆస్పత్రిలోనే ఉండనున్నారు. ఇందులో మహిళా కానిస్టేబుళ్లను కూడా నియమించారు. విశాఖ ఆస్పత్రిలో అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన అనంతరం వారికి ఎలాంటి చికిత్స అవసరమో వైద్యులు నిర్ణయించనున్నారు. డెల్యూషన్, స్కిజోఫీనియా వంటి వ్యాధుల లక్షణాలున్నట్లు తెలుస్తోంది.
డిసెంబర్ 24న మదనపల్లె రూరల్ మండలం అంకిశెట్టిపల్లె గ్రామంలోని శివనగర్‌లోని తమ ఇంట్లో పురుషోత్తంనాయుడు, పద్మజ దంపతులు మూఢవిశ్వాసాలతో తము కుమార్తెలైన అలేఖ్య, సాయిదివ్యలను దారుణంగా కొట్టి హత్య చేశారు. రెండు రోజుల తర్వాత అంటే డిసెంబర్ 26న వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని 14 రోజుల రిమాండ్ కోసం మదనపల్లి సబ్ జైలుకు తరలించారు. ఐతే జైలులో వింత అరుపులు, వింత చేష్టలతో పద్మజ హల్ చల్ చేసింది. సాటి ఖైదీలు, పోలీసులే ఆమె ప్రవర్తనకు బెంబేలెత్తిపోయారు. డాక్టర్ల సూచన మేరకు తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించగా.. అక్కడ కూడా వారికేమైందనేది తేల్చలేకపోయారు.
జైలులో ఉండగా తాను కాళికనని, శివుడి ప్రతిరూపాన్నని హల్ చల్ చేసిన పద్మజ.. ఆస్పత్రిలో మాత్రం సైలెంట్ గానే ఉంది. పురుషోత్తంనాయుడుకు కూడా సాధారణంగానే ప్రవర్తిస్తున్నారు. విశాఖ ఆస్పత్రికి వెళ్లే ముందు తన బ్యాగును తానే లోనికి తీసుకెళ్లారు. మదనపల్లిలో బయలుదేరే ముందు చేతులు తిప్పుతూ వింతగా ప్రవర్తించిన పద్మజ.. విశాఖలో మాత్రం నార్మల్ గానే ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh news, AP News, Crime, Crime news, Telugu news, Tirupati, Visakhapatnam, Vizag