MADANAPALLE DOUBLE MURDER CASE COUPLE RELEASED ON BAIL HERE IS THE FULL DETAILS OF WHERE THEY WENT AFTER GOT BAIL HSN
Madanapalle Double Murder Case: మదనపల్లె జంట హత్యల కేసు.. బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత.. పెంపుడు కుక్కతో సహా ఆ భార్యాభర్తలు ఎక్కడికెళ్లారంటే..
జైలు నుంచి బయటకు వస్తున్న పురుషోత్తం నాయుడు, పద్మజ/ అలేఖ్య, సాయిదివ్య (ఫైల్ ఫొటోలు)
మదనపల్లె జంట హత్యల కేసులో అరెస్టయిన పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులకు బెయిల్ మంజూరయింది. సబ్ జైలు నుంచి మంగళవారం ఆ దంపతులు బయటకు వచ్చారు. ఆ తర్వాత కారులో ఎక్కడకు వెళ్లారంటే..
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారత్ దేశమంతటా ఉలిక్కి పడిన మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులిద్దరికీ బెయిల్ మంజూరయిన సంగతి తెలిసిందే. మంగళవారం బెయిల్ పై ఆ భార్యాభర్తలిద్దరూ బయటకు వచ్చారు కూడా. ఉన్నతోద్యోగులైన పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులు మూఢనమ్మకాల వలలో చిక్కుకుని జనవరి 24వ తారీఖున కూతుళ్లిద్దరినీ అత్యంత దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అలేఖ్య, సాయిదివ్య అనే ఇద్దరు కుమార్తెలను పూజలో కూర్చోబెట్టి మళ్లీ జన్మిస్తారంటూ మాయమాటలు చెప్పి అతి కిరాతకంగా డంబెల్స్ తో కొట్టి మరీ తల్లే చంపేసింది. ఇంట్లో జరుగుతున్న పూజలు, కూతుళ్లను చంపడం గురించి పురుషోత్తమనాయుడు తన బంధువుల్లో ఒకరికి చెప్పడంతో వాళ్లు కాస్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ భార్యాభర్తలిద్దరికీ వైద్య చికిత్సలు పూర్తి చేసి జనవరి 26న అరెస్ట్ చేశారు. స్పెషల్ సబ్ జైలుకు పంపించారు. ఆ భార్యాభర్తలిద్దరి మానసిక ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఫిబ్రవరి 3వ తారీఖున విశాఖకు తరలించారు. అక్కడ మానసిక వైద్య ఆసుపత్రిలో చికిత్స నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి మార్చి 29న డిశ్చార్జ్ చేయడంతో మార్చి 30వ తారీఖున తిరిగి మదనపల్లె సబ్ జైలుకు వారిని తరలించారు. విచారణలో భాగంగా వారిద్దరి నుంచి పోలీసులు ఎలాంటి కొత్త విషయాలను బయటకు రాబట్టలేకపోయారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని 90 రోజులు పూర్తవడంతో రెండో ఏడీజే కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో వారిద్దరు సబ్ జైలు నుంచి ఏప్రిల్ 27న బయటకు వచ్చారు. అయితే వాళ్లిద్దరూ కూతుళ్ల హత్యలు జరిగిన శివ్ నగర్ లోని సొంతింటికి వెళ్లకపోవడం గమనార్హం.
పురుషోత్తంనాయుడు, పద్మజలకు కోర్టు బెయిల్ మంజూరు చేసిందన్న సంగతి తెలియగానే, పురుషోత్తం నాయుడి సోదరుడు శివ్ నగర్లోని తన అన్న ఇంటికి వెళ్లాడు. రెండు బ్యాగుల్లో దుస్తులు, ఇతర వస్తువులను సర్దాడు. అదే ఇంట్లో ఉంటున్న పెంపుడు కుక్కను కూడా కార్లో ఎక్కించుకున్నాడు. లగేజీని డిక్కీలో వేసుకుని సబ్ జైలు నుంచి బయటకు వచ్చిన తన అన్న, వదినలను కారులో ఎక్కించుకున్నాడు. పురుషోత్తం నాయుడి స్వగ్రామమైన తవణంపల్లె మండలం, కొండ్రాజుకాలువ గ్రామానికి తీసుకెళ్లాడు. ఇకపై కొన్నాళ్ల పాటుఅక్కడే ఉండాలని పురుషోత్తం నాయుడు, పద్మజ నిర్ణయించున్నట్టు తెలుస్తోంది. శివ్ నగర్లోని ఇంట్లోనే ఉంటే, కూతుళ్లు మరణించిన ఆ గదులను చూసి, అవే దృశ్యాలు మళ్లీ గుర్తుకు వస్తాయనీ, అది వీరిని ఇంకా కుంగిపోయేలా చేస్తుందని కుటుంబ సభ్యులు భావించారు. అందువల్లే వారి స్వగ్రామానికి వెళ్లినట్టు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.