ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు...ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కలకలం

బాంబు పెట్టారని ఓ మహిళా ప్రయాణీకురాలు ఇచ్చిన సమాచారం మేరకు భద్రతా సిబ్బంది ప్రయాణీకులను కిందకు దించి విమానాన్ని నిర్మానుష్య ప్రాంతానికి తరలించారు. విమానంలో పేలుడు పదార్థాల కోసం క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.

news18-telugu
Updated: December 15, 2018, 12:24 PM IST
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు...ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కలకలం
ఇండిగో విమానం (File photo)
  • Share this:
ముంబయి నుంచి దిల్లీ మీదుగా లక్నో వెళ్లాల్సిన ఓ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానాన్ని ముంబై విమానాశ్రయంలోనే నిలిపేశారు. ముంబై విమానాశ్రయంలో సదరు ఇండిగో విమానాన్ని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అందులో పేలుడు పదార్థాలేవీ లేకపోవడంతో భద్రతా సిబ్బంది, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం సృష్టించింది.

ఇండిగో విమానం శనివారం ఉదయం ముంబయి ఎయిర్‌పోర్టు నుంచి దిల్లీ మీదుగా లక్నోకు బయల్దేరాల్సి ఉంది. అయితే టేకాఫ్‌ అయ్యేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో విమానంలో బాంబు ఉన్నట్లు ఓ మహిళ సమాచారమిచ్చింది. గో ఎయిర్‌ విమానంలో దిల్లీ వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఓ మహిళ...విమానాశ్రయం టర్మినల్‌ 1 వద్ద ఉన్న ఇండిగో చెకిన్‌ కౌంటర్‌ దగ్గరకు వెళ్లి.. లక్నో వెళ్లనున్న ఇండిగో విమానంలో బాంబు ఉన్నట్లు చెప్పారు. అనుమానితులుగా భావిస్తున్న కొందరి ఫొటోలను సాక్ష్యాలుగా చూపించారు. సదరు వ్యక్తులు బాంబు పెట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.

దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ప్రయాణికులను దింపేసి విమానాన్ని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో విమానానికి ఎలాంటి ప్రమాదం లేదని భద్రతాసిబ్బంది స్పష్టం చేశారు. అయితే ఈ ఘటనపై ఇండిగో స్పందించింది. బాంబు ఉందంటూ చెప్పిన మహిళ మానసిక స్థితి సరిగ్గా లేదని ఇండిగో అధికార ప్రతినిధులు తెలిపారు. గంట ఆలస్యంగా విమానం ముంబై విమానాశ్రయం నుంచి లక్నోకు బయలుదేరి వెళ్లింది.

First published: December 15, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>