వారిద్దరు ప్రేమించుకున్నారు. వివాహ బంధంతో ఒక్కటి కావాలనుకున్నారు. పెద్దలను ఒప్పించి నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఐతే పెళ్లికి లాక్డౌన్ అడ్డుపడడంతో మనస్థాపానికి గురై..ఆ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా నార్నూరులో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. కన్నాపూర్కు చెందిన గణేష్, కంపూర్కు చెందిన సీతాబాయి ప్రేమించుకున్నారు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పడంతో పెద్దలు మొదట అంగీకరించలేదు. కానీ ఎలాగోలా ఒప్పించి.. నిశ్చితార్థం కూడా చేసుకున్నారు.
ఇక వివాహమే తరువాయి.. అనుకున్న క్రమంలో కరోనా మహమ్మారి వచ్చి పడింది. లాక్డౌన్ వల్ల పెళ్లి నిలిచిపోయింది. తక్కువ మందితో నిరాడంబరంగా జరిపిద్దామని కుటుంబ పెద్దలను కోరింది ప్రేమజంట. లేదు లాక్డౌన్ ముగిసే వరకు ఆగాల్సిందేనని వారు స్పష్టం చేశారు. ఐతే లాక్డౌన్ను అడ్డంపెట్టుకొని పెళ్లిని వాయిదా వేస్తున్నారని.. ఆ ప్రేమికులు మనస్థాపానికి గురయ్యారు. ఈ క్రమంలో పురుగుల మందు తాగి ఆత్యహత్య చేసుకున్నారు. ప్రేమికుల మరణ వార్తతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇరువురి కుటుంబాలు శోక సంద్రంలో మునిగాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.