Lovers Suicide: విషాదాంతమైన మరో ప్రేమ కథ.. పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో.. రాత్రి ఇంట్లో నుంచి వెళ్లి పోయి..

ఘటనా స్థలంలో ఉన్న బైక్

Telangana: తల్లిదండ్రుల పట్టింపులు ఇద్దరు ప్రేమికులు ప్రాణాలు తీసుకోవడానికి కారణమైంది. ఈ విషాదకర ఘటన సూర్యాపేట జిల్లా(Suryapet District) మనగాల మండలం మొద్దుల చెరువు గ్రామంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.

  • Share this:
    తల్లిదండ్రుల పట్టింపులు ఇద్దరు ప్రేమికులు ప్రాణాలు తీసుకోవడానికి కారణమైంది. పెళ్లికి పేరెంట్స్ అంగీకరించకపోవడంతో ప్రేమికులు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన సూర్యాపేట జిల్లా జిల్లా మనగాల మండలం మొద్దుల చెరువు గ్రామంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం చందుపట్లకు చెందిన ఓర్సు నవీన్‌(21), కేశబోయిన మహేశ్వరి(18) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల ఈ విషయాన్ని వారు తమ తల్లిదండ్రులకు చెప్పారు. తమ పెళ్లికి అంగీకరించమని కోరారు. అయితే వీరి నిర్ణయాన్ని తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో వీరిద్దరు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కలిసి చనిపోదామని నిర్ణయించుకున్నారు.

    ఈ క్రమంలో గురువారం రాత్రి 8 గంటల సమయంలో వీరిరువురు ఇంటి నుంచి బయటకు వచ్చారు. బైక్ పై మొద్దుల చెరువు గ్రామ శివారు వరకు వచ్చి అక్కడ ఓ వేప చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయాన్నే చెట్టుకు ఓ యువతి, యువకుడు ఉరేసుకుని వేలాడుతున్న విషయాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

    ఇదిలా ఉంటే.. ఆర్థిక ఇబ్బందులు ఆ తల్లీకూతుళ్ల ప్రాణాలు తీశాయి. ఓ వైపు పెళ్లి దగ్గర పడుతుండడం, మరో వైపు డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో మనస్తాపం చెందిన తల్లి, ఇద్దరు కూతుళ్లు బంగారం శుభ్రంచేసే కెమికల్ తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ఖమ్మంలోని త్రీ టౌన్ ప్రాంతానికి చెందిన గోవిందమ్మ(48), ఆమె కూతుళ్లు రాధిక(30), రమ్య(28) బుధవారం అర్థరాత్రి బంగారం శుభ్రం చేసే రసాయనం తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

    గోవిందమ్మది నిరుపేద కుటుంబం. దీనికి తోడు ఆమె భర్త ఏ పని చేయకపోవడంతో వారి కష్టాలు రెట్టింపయ్యాయి. ఈ క్రమంలో ఇద్దరు కూతుళ్ల పెళ్లీడుకు వచ్చారు. అయితే పెద్దకూతురుకు ఇటీవల వివాహం ఖాయమైంది. ఈ నెల 11న వివాహం జరిపించేందుకు నిర్ణయించారు. అయితే ఓ పెళ్లి సమయం దగ్గర పడడం.. మరో వైపు ఎక్కడా డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో ఆ తల్లీకూతుళ్లు కుంగి పోయారు. దీతో తీవ్ర మనస్తాపం చెంది బుధవారం అర్థరాత్రి సమయంలో బంగారం శుభ్రం చేసేందుకు వినియోగించే కెమికల్ తాగి ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా పెను విషాదం నింపింది.
    Published by:Nikhil Kumar S
    First published: