ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య ఘటన కలకలం సృష్టించింది. జిల్లాలోని కృష్టగిరి మండలం మల్యాల వద్ద రైలు కింద పడి వారు బలవన్మరణానికి పాల్పడ్డారు. చనిపోయినవారిని ఆలంకొండకు చెందిన ప్రసాద్, అనితలుగా పోలీసులు గుర్తించారు..
వేర్వేరు కులాలకు చెందిన ప్రసాద్, అనిత గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. అయితే పెద్దలు వారి ప్రేమను అంగీకరించలేదు. ఈక్రమంలో ప్రసాద్ కుటుంబీకులు అతనికి అక్క కూతురితో 45 రోజుల క్రితం వివాహం జరిపించారు. ఇష్టంలేని భార్యతో కలిసుండలేనని ప్రసాద్.. అనితకు చెప్పగా, ఇద్దరూ కలిసి తీవ్ర నిర్ణయం తీసుకున్నారు.
ప్రసాద్ మంగళవారం రాత్రి అనితను కలుసుకొని, ఇద్దరూ కలిసి మల్యాల వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం ఉదయం మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించి, ఇరు కుటుంబాలకు సమాచారం అందించారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అయితే, వీరిది ఆత్మహత్యేనా? ఇంకేదైనా జరిగిందా? అనే కోణంలోనూ విచారిస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kurnool, Lovers suicide