Hyderabad: ఆంజనేయస్వామి పిలుస్తున్నాడు.. వెళ్లిపోతున్నా.. 40 ఏళ్ల వ్యక్తి సూసైడ్ నోట్

ప్రతీకాత్మక చిత్రం

ఘటనా స్థలంలో ఓ సూసైడ్ నోట్ లభ్యమయింది. ఆంజనేయ స్వామి పిలుస్తున్నాడని.. అందుకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నట్లు అందులో రాసి ఉంది.

  • Share this:
    ఈ సమాజంలో అందరికీ సమస్యలు ఉన్నాయి. కొందరికి ఆర్థిక ఇబ్బందులు ఉంటే.. మరికొందరికి కుటుంబ సమస్యలు ఉన్నాయి. ఇంకొందరిని అనారోగ్యం వేధిస్తోంది. ఇలా భూమిపై ఉన్న ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమస్య ఉంటుంది. ఐతే చాలా మంది మాత్రం వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. కొందరు మాత్రం సమస్యలను చూసి భయపడతారు. ఇబ్బందులను ఎదుర్కోలేక నిత్యం కుంగిపోతుంటారు. ఈ క్రమంలోనే మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకుంటారు. హైదరబాద్‌లో ఇలాగే ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. 40 ఏళ్ల వయసున్న ఆయన పెళ్ల కావడం లేదన్న మనస్థాపంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని కవాడిగూడ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా కొండపాక ఎర్రవెల్లి ప్రాంతానికి చెందిన పి.గోపాల్‌ (40) కవాడిగూడలోని తాళ్లబస్తీలో ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. అంతకు ముందు తన తమ్ముడు రవి (37) కూడా అక్కడే ఉండేవాడు. ఇద్దరు పనిచేసుకుంటూ జీవనం సాగించేవారు. ఐతే 6 నెలల క్రితం గోపాల్‌ తమ్ముడు రవికి వివాహం జరిగింది. పెళ్లైన తర్వాత రవి తన అన్న నుంచి విడిపోయి వేరు కాపురం పెట్టాడు. రామంతపూర్‌లో రూమ్‌ను అద్దెకు తీసుకొని భార్యతో కలిసి నివసిస్తున్నాడు. గత ఆదివారం రవి తన అన్నను చూసేందుకు కవాడిగూడకు వచ్చాడు. ఆ సమయంలో గోపాల్ యోగా చేస్తూ కనిపించాడు. కాసేపు మాట్లాడుకున్న తర్వాత.. రవి తిరిగి రామంతపూర్‌లోని తన నివాసానికి పాల్పడ్డాడు. ఐతే అదే రోజు రాత్రి గోపాల్ ఆత్మహత్య చేసుకున్నాడు. బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

    ఆ రోజు నుంచీ తలుపు మూసి ఉంది. ఇంటి నుంచి ఎలాంటి అలికిడి లేకపోవడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చింది. బుధవారం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు తాళ్లబస్తీకి వచ్చి గోపాల్ గది తలుపును తెరిచి లోపలికి వెళ్లారు. బెడ్‌రూమ్‌లో అతడి శవం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. మూడు రోజుల క్రితమే అతడు చనిపోయాడని పోలీసులు భావిస్తున్నారు. క్లూస్ టీమ్ చేరుకొని వివరాలను సేకరించారు. ఘటనా స్థలంలో ఓ సూసైడ్ నోట్ లభ్యమయింది. ఆంజనేయ స్వామి పిలుస్తున్నాడని.. అందుకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నట్లు అందులో రాసి ఉంది. గోపాల్ మృతిపై అతడి సోదరుడు రవికి సమాచారం ఇచ్చారు పోలీసులు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తమ్ముడికి పెళ్లయినప్పటి నుంచి గోపాల్ అదోలా ఉంటున్నాడని.. తనకు పెళ్లి కావడం లేదని బాధపడేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: