Home /News /crime /

LOCAL MADE 40 NATU BOMBS FOUND IN SRIKAKULAM DISTRICT NGS

Andhra Pradesh: శ్రీకాకుళంలో నాటు బాంబుల కలకలం.. ఎందుకు పెట్టారో తెలుసా?

శ్రీకాకుళం జిల్లాలో నాటు బాంబుల కలకలం

శ్రీకాకుళం జిల్లాలో నాటు బాంబుల కలకలం

ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే శ్రీకాకుళం జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఓ ఇంట్లో 40 నాటు బాంబులు లభ్యం అవ్వడం కలకలం రేపింది. ఈ బాంబులు తయారు చేస్తున్నది ఎవరు? ఎందుకు తయారు చేస్తున్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    ఒకప్పుడు ప్రశాంతతకు మారు పేరు శ్రీకాకుళం జిల్లా. కానీ ఇప్పుడు అక్కడ రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే జిల్లా ఘర్షణలకు.. కొట్లాటలకు వేదిక అవుతోంది. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో మరీ దారుణ పరిస్థితులు కనిపించాయి. ఇళ్లు, భారీగా ఆస్తులు ధ్వంసం అయ్యేలా దాడులు చేసుకున్నారు. మనుషులకు రక్తం కారేలా కర్రలతో దాడులు చేసుకున్నారు. దీంతో జిల్లా వాసులు భయం గుప్పిట గడుపుతున్నారు..

    తాజాగా జిల్లాలో నాటు బాంబులు కలకలం రేపాయి. కంచిలి మండలం గొల్లకంచిలిలో నాటుబాంబులను పోలీసులు గుర్తించారు. అది కూడా ఒక ఇంట్లో సుమారు 40 నాటు బాంబులను నిల్వ ఉంచినట్టు తనిఖీల్లో బయటపడింది. ఆ బాంబులతో పాటు వాటి తయారీకు ఉపయోగించే గాజుముక్కలు, రాళ్ళు, ఇతర ముడి సరకు స్వాధీనం చేసుకున్నారు. అందులో చాలా బాంబులను ఇటీవలే తయారు చేసినట్టు గుర్తించారు.

    అయితే  ఆ బాంబులు ఎక్కడి నుంచి వచ్చాయి.. అక్కడే తయారు చేస్తున్నారా..? వేరే ఎవరైనా ఆ ఇంట్లో దాచి పెట్టమని ఇక్కడ పెట్టారా? అని పోలీసులు ఆరా తీసినా వారు సరైన సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. అయితే కేవలం జంతువుల వేట కోసం ఉపయోగించడానికి నాటుబాంబులు తయారు  చేస్తున్నారా? లేక ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో జరిగిన గొడవలను కొనసాగిస్తూ ఎవరిపైనైనా దాడి చేయడానికి తెప్పించారా..?  కాదంటే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికైనా సరఫరా చేయాలి అనుకున్నారా? ఇలా అన్ని కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏజెన్సీకి దగ్గరగా ఉండడంతో పాటు భారీగా బాంబులు బయపడడంతో మావోయిస్టుల లింకులపైనా పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.

    నాటు బాంబులు భారీగా దొరికిన నేపథ్యంలో ఆ ఇంటి యజమానితో పాటు.. అక్కడ ఉన్న మరో పది మందిని అదుపులోకి తీసుకుని  పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వారు చెప్పిన సమాధానాలు కూడా పొంతన లేకుండా ఉండడంతో మరిన్ని అనుమానాలు పెరుగుతున్నాయి. దీని వెనుక రాజకీయ నేతలు ఎవరైనా ఉన్నారా అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

    ఒకప్పుడు ప్రశాంతంగానే ఉండే జిల్లాలో ఇటీవల పంచాయతీ ఎన్నికలు చిచ్చు పెట్టాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు గెలుపు కోసం ఢీ అండే ఢీ అన్నాయి.. ఒక వర్గంపై మరో వర్గం ఆరోపణలకు మాత్రమే పరిమితం అవ్వలేదు. దాడులు, ప్రతిదాడులు, అరెస్టులతో పరిస్థితి రణరంగాన్ని తలపించింది. అందుకే కొన్ని గ్రామాల్లో రెండు మూడు రోజుల పాటు పోలిస్ పికిటింగ్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు నాటు బంబులతో పరిస్థితి మరింత ఆందోళన పెంచుతోంది.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap local body elections, AP News, Municipal Elections, Srikakulam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు