ప్రస్తుతం అంతా స్మార్ట్ యుగం నడుస్తోంది. ముఖ్యంగా బ్యాంకింగ్ లావాదేవీలన్నీ ఆన్ లైన్లోనే సాగుతున్నాయి. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఎవరికైనా, ఎక్కడి నుంచి ఎక్కడికైనా డబ్బులు పంపేయొచ్చు. అంతేకాదు లోన్లు కూడా అంతే ఫాస్ట్ గా తీసుకోవచ్చు. యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే చాలు క్షణాల్లో డబ్బులు ఎకౌంట్లో పడతాయి. దీంతో చిన్నచిన్న అవసరాల కోసం యాప్స్ లో అప్పు తీసుకునేవారి సంఖ్య పెరిగితోంది. అలాంటి వారి అవసరాన్ని ఆసరాగా తీసుకుంటున్న లోన్ యాప్స్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. తీసుకున్న అప్పు చెల్లించకపోతే బెదిరింపులకు దిగడమే కాదు.. వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారు. అప్పులు తీసుకున్న మహిళల ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి వారి పరువుతీస్తున్నారు. ఇలాంటి ఘటనే ఖమ్మం (Khammam)లో ఒకటి జరిగింది.
తీసుకున్న అప్పు ఇంకా తీరలేదని ఇంకా చెల్లించాలని లేకపోతే.. మీ అమ్మ ఫోటోను మార్ఫింగ్ చేసి.. పోర్న్ సైట్ (Porn site)లో అప్ లోడ్ చేస్తాం’ అంటూ ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన యువకుడిని ఓ లోన్ యాప్ (Loan app) బెదిరించింది. అంతేకాదు బాధితుడి కాంటాక్ట్ లిస్టులో ఉన్న మొబైల్ నంబర్లకు సదరు యువకుడు మోసగాడని (Cheater) పేర్కొంటూ మెసేజ్ లు పంపారు. దీంతో బాధితుడు మధిర వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
యూపీఐ ద్వారా పేమెంట్..
గతంలో తాను instant loan app ద్వారా ఐదు వేల రూపాయల రుణం తీసుకున్నట్లు… గడువులోగా అంటే వారంలోగా తిరిగి చెల్లించినట్లు బాధితుడు ప్రదీప్ తెలిపాడు. ఆ తర్వాత మూడు వేల ఐదు వందలు చొప్పున రెండుసార్లు లోన్ తీసుకున్నానని అన్నారు. గడువులోగా తిరిగి చెల్లించేందుకు ప్రయత్నిస్తే.. యాప్/ website పని చేయలేదని బాధితుడు పేర్కొన్నాడు. దీంతో నిర్వాహకులకు ఫోన్ చేస్తే.. యూపీఐ ద్వారా పేమెంట్ చేయాలంటూ లింకు పంపారు. వారు పంపిన ఆ యూపీఐకు (UPI) ఆ మొత్తం చెల్లించానని బాధితుడు వివరించారు. తర్వాత రుణ బకాయి ఇంకా ఉందంటూ వేధింపులు ప్రారంభించారని వాపోయాడు. రుణం తీసుకునే ముందు తన ఆధార్ తో పాటు తన తల్లి పాన్ కార్డ్ కాపీలను అడిగారని వివరించాడు.
అయితే ఇప్పుడు డబ్బులు కట్టకుంటే పాన్ కార్డుపై ఉన్న మా అమ్మ ఫోటోలు మార్ఫింగ్ చేసి, పోర్న్ సైట్లలో పెడతామని బెదిరిస్తున్నారని తెలిపాడు బాధితుడు. నా కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వారికి నన్ను దొంగ/మోసగాడు పేర్కొంటూ మెసేజ్లు పంపుతున్నారు. నా ఆధార్ కార్డుపై ‘రేపిస్ట్’ అంటూ మార్ఫింగ్ చేసి.. నా కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నవారికి షేర్ చేస్తున్నారు‘ అన్ని ప్రదీప్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ వేధింపులు భరించలేక వారు చెప్పినట్లు రూ.4000 చెల్లించినా.. ఇంకా బకాయి ఉందంటూ ఫోన్ చేస్తున్నారని వాపోయాడు. తనను ఇబ్బంది పెడుతున్న ఇలాంటి వాళ్లపై చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Khammam, Loan apps