ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం షాపల్లి గ్రామంలో మావోయిస్టుల పేరుతో వెలసిన గోడ పత్రికలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఇదే జిల్లాలో టీఆర్ఎస్ నేత భీమేశ్వరరావును మావోయిస్టులు చంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోయిస్టుల పేరిట లేఖ విడుదల కావడం స్థానికుల్లో మరింత ఆందోళన పెంచుతోంది. తెలంగాణ ప్రభుత్వం పోలీసు బలగాలతో అడవులను జల్లడ పట్టడం ఆపాలని లేఖలో డిమాండ్ చేశారు. కూంబింగ్ లకు ఆపకపోతే రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులకు భీమేశ్వరరావుకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. పలువురు ఫారెస్టు అధికారులు పద్ధతి మార్చుకోవాలని లేఖలో వార్నింగ్ ఇచ్చారు. కొత్త రెవెన్యూ చట్టం పేరుతో కేసీఆర్ చేసిందేమీ లేదంటూ ధ్వజమెత్తారు. అయితే ఆ లేఖ నకిలీదని పోలీసులు తెలిపారు.
ములుగు జిల్లాలో టీఆర్ఎస్ నేత భీమేశ్వర్‌ను ఇటీవల మావోయిస్టులు అతి కిరాతకంగా చంపేశారు. వెంకటాపురం మండలం... అలుబాకలో ఈ ఘటన జరిగింది. అర్థరాత్రివేళ భీమేశ్వర్ ఇంటికి వచ్చిన మావోయిస్టులు... అత్యవసరంగా డబ్బులు కావాలి... ఆస్పత్రికి వెళ్లాలి అంటూ... ఆయన్ని బయటకు రమ్మన్నారు. ఇంత రాత్రివేళ తన దగ్గర డబ్బులు లేవన్న భీమేశ్వర్... డోర్ తియ్యలేదు. దాంతో మావోయిస్టులు డోర్‌పై కాల్పులు జరిపి... భీమేశ్వర్‌ను బయటకు పిలిచారు. నిద్రమత్తులోనే ఆయన బయటకు వచ్చారు. ఆ తర్వాత మావోయిస్టులు ఆయన్ని దారుణంగా కత్తులతో పొడిచారు. తనను చంపొద్దని మీరు ఏం చెబితే అది చేస్తానని భీమేశ్వర్ వేడుకున్నా... మావోయిస్టులు ఆగలేదు. ప్రాణాలు తీసేశారు.
ములుగుపై ప్రభుత్వం ఫోకస్:
తెలంగాణలో మావోయిస్టుల అలజడి పెరగడంతో... ప్రభుత్వం ఈ మధ్య ఆదిలాబాద్, ములుగు జిల్లాలపై ఎక్కువ ఫోకస్ పెడుతోంది. అటు ఛత్తీస్‌గఢ్ బోర్డర్లో అధిక సంఖ్యలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. మావోయిస్టుల అణచివేతకు బీఎస్ఎఫ్ను రంగంలోకి దించింది. సీఆర్పీఎఫ్తోపాటు బీఎస్ఎఫ్ బలగాలు సైతం అడవులను జల్లెడ పట్టడానికి రెడీ అవుతున్నాయి. ఇందులో భాగంగా బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్కు చెందిన ఉన్నతాధికారులు ఐదు రోజుల కిందట రెండు ప్రత్యేక హెలీకాప్టర్లలో వచ్చారు.
అంతేకాదు... కొన్ని రోజుల క్రితం ములుగు జిల్లాలోని వెంకటాపురం పోలీస్ స్టేషన్లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి, స్మగ్లర్ వీరప్పన్‌ను ఎన్కౌంటర్ చేసిన సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారి విజయ్ కుమార్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సీఆర్పీఎఫ్ డీజీపీలు, ఐజీ నాగిరెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర, బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు సమావేశం జరిగింది. మీటింగ్‌లో ముఖ్యంగా మావోయిస్టుల అణచివేత అంశంపైనే చర్చ జరిగినట్లుగా రాష్ట్ర పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామాలతో ఉలిక్కిపడుతున్న మావోయిస్టులు తాజా ఘటనతో... పోలీసులకు సవాల్ విసిరినట్లైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Maoists, Naxals, Telangana Police