Andhra Pradesh: కారు అద్దెకు ఇస్తున్నారా..? బీకేర్ ఫుల్.. కోట్లు కొల్లగొడుతున్నారు..

అద్దెకార్లు పేరుతో కోట్లు కొల్లగొడుతున్నారు.

మీ దగ్గర కారు ఉందా.. అయితే కేటుగాళ్లతో బీ కేర్ ఫుల్.. కారు అద్దెకు ఇస్తారా..? మంచి అద్దె ఇప్పిస్తామని నమ్మిస్తారు.. కానీ కొన్ని నెలల తరువాత మీకు తెలియకుండానే మీ కారు ఓనర్ మారిపోయే ప్రమాదం ఉంటుంది..

 • Share this:
  కారుకు అద్దె చెల్లిస్తామంటారు.. ఒకటి రెండు నెలలు తప్పక అద్దె చెల్లిస్తారు.. కానీ ఆ తరువాత అసలు కనిపించరు.. తీరా కారు ఏమైందని చెక్ చేసుకుంటే అది తనఖాలో ఉంటుంది. మాయ మాటలతో నమ్మించి మంచి అద్దె వస్తుందని చెప్పి కారును తీసుకెళ్తారు.. తరువాత యజమానికి తెలియకుండా తాకట్టు పెట్టేస్తారు. అలా వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తారు. ఇంతకాలం ఇలా మోసాలతో జల్సాలు చేస్తున్న ఘనలను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దర్ని అరెస్టు చేయగా... మరొకరి కోసం గాలిస్తున్నారు. నిందితుల నుంచి సుమారు 2 కోట్ల రూపాయల విలువ చేసే 29 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చాలా రోజులుగా వీరు ఈ మోసాలకు పాల్పడుతున్నా ఎవరూ గుర్తించలేకపోయారు. ఇప్పుడు అద్దె డబ్బులు సక్రమంగా ఇవ్వడం లేదనే అనుమానంతో ఓ వ్యక్తి ఆరా తీయగా అసలు విషయంలో వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు పోలీసులు గుర్తించనవి 29 కార్లు.. ఇంకా వీరి ఖాతాలో ఎందరు బాధితులు ఉన్నారో ఏమో.. మరో నిందితుడి దొరికితే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది...

  ఈ కేసుకు సంబంధించి పార్వతీపురం పట్టణం వైకేఎం కాలనీకి చెందిన ఎం.చంద్రమౌళిపై సీతంపేట తురాయివలసకు చెందిన 26 ఏళ్ల పి.రాజేష్‌ అనే వ్యక్తి గత నెల 29న పార్వతీపురం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కారును అద్దెకు తీసుకొని ఇంకొకరికి తాకట్టు పెట్టినట్లు తెలిసిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ వాహనం ఖరీదు 9.5 లక్షలని, తనకు ఇప్పించి న్యాయం చేయాలని ఆయన పోలీసులను కోరారు. దీంతో దర్యప్తు చేసిన పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి.

  ఎం.చంద్రమౌళి పార్వతీపురంలో ఓ ట్రావెల్స్‌ ఏజెన్సీ నడుపుతున్నారు. ఈయనకు బొబ్బిలికి చెందిన ఎస్‌.రవి, శ్రీకాకుళం జిల్లా సీతంపేటకు చెందిన ఎల్‌.శివరామకృష్ణతో పరిచయం ఏర్పడింది. ఎవరి దగ్గరైనా కార్లను తనకు అద్దెకు ఇప్పిస్తే నెలకు 30 వేలు వరకు ఇప్పిస్తానని, అదనంగా కొంత కమీషన్‌ కూడా ఇస్తానని చెప్పడంతో ఇద్దరూ అంగీకరించారు. అలా శివరామకృష్ణ, రవి కొన్ని కార్లను ఇచ్చారు. అలా 29 కార్లను ఇతరుల వద్ద తనఖా పెట్టినట్లు చంద్రమౌళి పోలీసుల విచారణలో అంగీకరించారు. పార్వతీపురంలో 9, బొబ్బిలిలో 4, బలిజిపేటలో 10, విజయనగరం పట్టణంలో 6 కార్లను తాకట్టు పెట్టినట్లు చెప్పారు. ఈ కేసులో ఎం.చంద్రమౌళి, ఎల్‌.శివరామకృష్ణ పట్టుబడ్డారని, రవి పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

  కేసులో సూత్రధారి అయిన ఎం.చంద్రమౌళి బీటెక్‌ చదివారు. వ్యసనాలకు బానిసైన ఆయన ఇద్దర్ని పెళ్లాడారు. గతంలోనూ ఈయనపై పలు కేసులు నమోదయ్యాయి. ఏటీఎంల వద్ద వృద్ధులను మోసగించి డబ్బులు లాగేయడం, ఓ వ్యాపారి హత్య కేసులో సుపారీ తీసుకొని చివరి నిమిషంలో తప్పుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. శివరామకృష్ణ గతంలో శ్రీకాకుళం జిల్లాలోని ఓ ఎంపీడీవో కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేసే వారు. వివిధ పథకాల్లో కార్లను రుణాల మీద తీసుకున్న వారిని ఆయన గుర్తించారు. అవి ఎవరెవరి దగ్గర ఉన్నాయి..?, ఎవరు వాడుతున్నారు..? వివరాలను తెలుసుకొని, వాటిని అద్దెకు ఇవ్వాలని ఆయా యజమానులతో మాట్లాడి మధ్యవర్తిగా వ్యవహరించారు. బొబ్బిలికి చెందిన ఎస్‌.రవి కూడా వ్యసనాలకు బానిసయ్యాడు. అధిక మొత్తంలో డబ్బులు వస్తుండటంతో వీరితో చేతులు కలిపాడు.

  పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాల్లో 3 పార్వతీపురానికి చెందినవి, 10 బత్తిలి, 6 సీతంపేట, 1 చీడికాడ, 2 విశాఖపట్నం పీఎంపాలెం, ఒకటి ఎంవీపీ కాలనీకి సంబంధించినవిగా తేల్చారు. మిగిలిన 6 కార్లు ఎవరివో తెలియాల్సి ఎస్పీ చెప్పారు. ఈ సందర్భంగా పార్వతీపురం డీఎస్పీ ఎ.సుభాష్‌, పాలకొండ డీఎస్పీ ఎం.శ్రావణి, పార్వతీపురం సీఐ సీహెచ్‌ లక్ష్మణరావు, ఎస్‌ఐ జి.కళాధర్‌, గ్రామీణ ఎస్‌ఐ జి.వీరబాబు, బత్తిలి ఎస్‌ఐ కేవీ సురేష్‌, ఏఎస్‌ఐ వి.రవి, కానిస్టేబుళ్లు కె.శ్రీనివాసరావు, బత్తిలి కానిస్టేబుళ్లు ఎ.రాంబాబు, పి.రమణలను ఎస్పీ అభినందించి, నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.
  Published by:Nagesh Paina
  First published: