హోమ్ /వార్తలు /క్రైమ్ /

Telangana: నరబలి కోసం కిడ్నాప్ చేసిన బాలిక ఉత్తరప్రదేశ్ లో ప్రత్యక్షం.. క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు.. పోలీసుల విచారణలో ఇంకా..

Telangana: నరబలి కోసం కిడ్నాప్ చేసిన బాలిక ఉత్తరప్రదేశ్ లో ప్రత్యక్షం.. క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు.. పోలీసుల విచారణలో ఇంకా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Khammam: మనం మోసపోతున్నంత కాలం మోసం చేసేవాడు చేస్తూనే ఉంటాడు. అలాంటిదే మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని వాటిని బయటకు తీయాలంటే నరబలి ఇవ్వాలనడంతో మైనర్ బాలికను బలి చేయాలని పూజారి, బాలిక సమీప బంధువులు నిర్ణయించుకన్నారు. తీరా చూస్తే ఆ బాలిక ఉత్తర ప్రదేశ్ లో ప్రత్యక్షం. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు వంద రోజుల తర్వాత కేసును ఛేదించారు.

ఇంకా చదవండి ...

  వంద రోజులకు పైగా పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేసిన కేసు. క్షుద్ర పూజల కోసం ఓ మైనర్‌ బాలికను కిడ్నాప్‌ చేసిన పూజారి ఆమెను ఉత్తరప్రదేశ్‌కు తరలించాడు. అక్కడే ఆమెను బందీగా ఉంచాడు. ఎట్టకేలకు మైనర్‌ బాలికతో సహా, ప్రధాన సూత్రధారి, పాత్రధారి అయిన పూజారి సూర్యప్రకాష్‌శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్‌ బాలిక వెల్లంకి రాజశ్రీ ని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. అసలు ఎందుకు కిడ్నాప్‌ చేశాడు.. ఉత్తరప్రదేశ్‌ దాకా ఎందుకు తీసుకెళ్లాడు.. ఇన్నాళ్లూ అక్కడేం చేశాడు.. ఈ వ్యవహారంలో ఇంకెవరెవరి పాత్ర ఉందన్న దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మొదటి నుంచి తీవ్ర వత్తిడికి గురై.. అనేక విమర్శల పాలైన పోలీసులు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్నారు. ఎర్రుపాలెం ఎస్సై ఉదయ్‌కిరణ్‌ ఈ కేసును సవాల్‌గా తీసుకుని మైనర్‌ బాలికను కిడ్పాపర్‌ చెర నుంచి విడిపించడమే కాకుండా.. కిడ్నాపర్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఎస్సై ఉదయ్‌కిరణ్‌పై ప్రసంశల జల్లు కురుస్తోంది. అసలేంటి ఈ కేసు.. అప్పుడేం జరిగిందంటే..

  ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్లలో గత డిసెంబర్‌ 17వ తేదీన వెల్లంకి రాజశ్రీ అనే మైనర్‌ బాలిక కనిపించకుండా పోయింది. దీనిపై ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే అదే గ్రామంలో మిస్సింగ్‌ అయిన బాలిక ఇంటికి అత్యంత సమీపంలోని ఆమె సమీప బంధువు ఒకరు.. తన ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయన్న మూఢ నమ్మకంతో నట్టింట్లో ముప్పై అడుగుల లోతున ఓ పెద్ద గొయ్యి తవ్వి.. ఆ నిధులను చేజిక్కించుకోడానికి బెంగళూరుకు చెందిన సూర్యప్రకాష్‌శర్మ అనే పూజారిని రప్పించిన విషయం తెలిసిందే. అయితే ఎప్పుడో పూర్వీకులు నిక్షిప్తం చేసిన గుప్త నిధులు ఎలాంటి దోషాలు లేకుండా చేజిక్కాలంటే రక్తం చిందాల్సిందేనన్న పూజారి సూచనతో నిత్యం నాటు కోళ్లను కోయడం.. రక్తంతో అభిషేకం చేయడం.. ప్రతిరోజు అర్థరాత్రి ఊరోళ్లంతా నిద్రపోతున్న సమయంలో పెద్దపెద్ద కేకలు వేస్తూ క్షుద్రపూజలు చేస్తుండడం.. అయినా నిధి దక్కకపోవడంతో నరబలి కావాల్సిందేనన్న పూజారి డిమాండ్‌కు అనుగుణంగా పేదరికంలో ఉన్న తన సమీప బంధువు కుమార్తెను టార్గెట్‌ చేశారన్న కథనం వినిపించింది.

  మైనర్‌ బాలిక ఒంటరిగా దొరకాలంటే ఆమె తల్లిదండ్రులు అక్కడ లేకుండా పోవాల్సి ఉంటుంది కనుక.. వారిని గుంటూరు జిల్లా పెదకాకాని గుడికి వెళ్లి రావాలని పూజారి సూచించాడు. ఈమేరకు మైనర్‌ బాలిక తల్లి గుడికి వెళ్లొచ్చిన రోజు రాత్రి నుంచి బాలిక మిస్‌ అయింది. ఈమేరకు ఆమె తల్లి రాణి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదైంది. ఈ గుప్త నిధులను చేజిక్కించుకునే వ్యవహారం అప్పటికే నెలరోజుల నుంచి సాగుతోందని.. తమ గ్రామానికి చెందిన నరసింహారావు నివాసంలో ప్రతిరోజు రాత్రి పెద్దపెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయని.. తమకు భయం వేస్తోందని గ్రామస్తులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాధ్యులైన వారందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు మైనర్‌బాలిక కనిపించకుండా పోయిన విషయంపై సీరియస్‌గా దృష్టి సారించారు.

  ఈ కేసులో ప్రధాన నిందితుడు, పూజారి సూర్యప్రకాష్‌శర్మను పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఇప్పటికే బాలికను వారి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు.. ఇంకా కేసుకు సంబంధించి ఎవరెవరి పాత్ర ఉంది..? అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. మైనర్‌ బాలికను పూజారి ఎందుకు తీసుకెళ్లాడన్న విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మూణ్నెళ్లకు పైగా ఆమెను అదుపులో ఉంచుకుని అనేక రాష్ట్రాలు తిప్పిన పూజారి సూర్యప్రకాష్‌శర్మ ఏంచేశాడన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే సూర్యప్రకాష్‌శర్మకు ఇది చాలా కామన్‌ విషయమని.. కష్టాల్లో ఉన్నవారిని లంకె బిందెలు.. గుప్త నిధులని నమ్మించి వారి నుంచి భారీగా డబ్బు గుంజడం లాంటి వాటిని అలవాటుగా మార్చుకున్నాడని.. ఇతను ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఇలాంటి పూజలను జరిపించినట్టు చెబుతున్నారు. ఇలాంటి మోసగాళ్ల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు.

  Published by:Veera Babu
  First published:

  Tags: Cracked police, Khammam, Kshudra pooja, Minor girl kidnaped, Telangana, Uttarapradessh

  ఉత్తమ కథలు