ఖమ్మంలో కిలాడి లేడీ, ఆమె ప్లానింగ్, దాన్ని అమలు చేయడం మామూలుగా లేదుగా

మోసాలకు పాల్పడడానికి అనువైన ప్రాంతాలపై అవగాహన పెంచుకున్న అనంతరం ఆమె కుటుంబం నేరుగా దగ్గరిలోని పల్లెటూర్లో అద్దెకు దిగుతుంది.

news18-telugu
Updated: October 7, 2020, 5:03 PM IST
ఖమ్మంలో కిలాడి లేడీ, ఆమె ప్లానింగ్, దాన్ని అమలు చేయడం మామూలుగా లేదుగా
ఇద్దరు కుమారులతో పురాణం శివకుమారి (File)
  • Share this:
(జి. శ్రీనివాసరెడ్డి, న్యూస్ 18 తెలుగు, ఖమ్మం)

ఆమెకు డబ్బు పిచ్చి. పైగా అది కూడా ఈజీగా.. వీలైనంత స్పీడ్‌గా సంపాదించాలన్నదే ఆమె లక్ష్యం. దీనికోసం ఆమె ఎంచుకున్న మార్గం మోసం. ఇలా ఏళ్ల తరబడి వివిధ ప్రాంతాల్లో మోసాలకు పాల్పడుతూ చివరకు కేసులు పాలై కటకటాలు లెక్కపెడుతున్న మాయలేడి ఫ్యామిలీ కథ ఇది. చూడ్డానికి ఓ పద్దతి కలిగిన కుటుంబం నుంచి వచ్చిన మహిళగా పిక్చరిస్తూ .. భర్త, ముగ్గురు కుమారులతో కలిసి ఉంటోంది. తాము హైదరాబాద్‌, విజయవాడ తదితర నగరాల్లో సుమారు 250 కి పైగా హాస్టళ్లు నడుపుతున్నామని.. వందలాది మందికి ఉపాధి చూపుతున్నామని.. దీనికోసం తామే క్షేత్ర స్థాయిలో సరకులను కొనుగోలు చేస్తుంటామని జనాన్ని నమ్మిస్తుంటారు. బియ్యం కోసం వడ్లు, కందిపప్పు.. మినప్పప్పు.. పెసరపప్పు.. మిర్చి.. ఇంకా భారీ మొత్తంలో ఆయిల్స్‌ ఇలా ఎలాంటి నిత్యావసర సరకులైనా లారీలకు లారీలే కొనడం ఆమె నైజం. దీనికోసం భారీ చెల్లింపులు చేయాల్సి ఉంటుందని నమ్మించి పెద్ద మొత్తాల్లో డబ్బు అప్పుగా తీసుకోవడం.. ఆనక కనిపించకుండా పోవడం ఆమె స్టైల్‌. మొత్తం మీద కొంత కాలం పక్కాగా చెల్లింపులు చేయడం.. బాగా నమ్మకం కుదిరాక పెద్ద మొత్తంలో సరకు ఎత్తడం.. దీనికోసమేనంటూ తెలిసిన వాళ్ల నుంచి.. పరిచయస్తుల నుంచి పెద్ద వడ్డీలు ఆశ పెట్టి ఎక్కవ మొత్తంలో డబ్బు అప్పు చేయడం.. ఆపై ముఖం చాటేయడం.. ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాల్లో గత మూడేళ్లుగా ఇలా ఆమె చేసిన మోసాల మొత్తం సుమారు పదికోట్లకు పైగానే ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెను నమ్మి మాలోత్‌ సునీత అనే ఓ మహిళ రూ.70 లక్షలు అప్పుగా ఇచ్చిందంటేనే ఎదుటివారిని నమ్మించడంలో ఆమె నైపుణ్యం ఏంటో అంచనా వేయొచ్చు. ఇదీ పురాణం శివకుమారి కుటుంబం మోసాల కథ.

విజయవాడ భవానినగర్ కు చెందిన పురాణం శివకుమారి అనే మహిళ… తన ముగ్గురు కుమారులతో కలసి అధిక మొత్తంతో నిత్యవసర సరుకులు కొనుగోలు.. సరఫరా చేస్తున్నట్లు వ్యాపారులను, రైతులను ముందుగా డబ్బులు చెల్లించి నమ్మించింది. తరువాత లక్షల్లో అప్పు చేసి, డబ్బులు కాజేసి బాధితులకు కుచ్చు టోపి పెట్టింది. తాము మోసపోయామని గుర్తించిన బాధితులు అమెను నిలదీయగా డబ్బులు తిరిగి ఇచ్చేందుకు వాయిదా వేస్తూ వచ్చింది. దీంతో నమ్మకం కోల్పోయి ఆగ్రహానికి గురైన ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణ పూరం రాఘవేంద్ర నగర్ కు చెందిన మాలోతు సునీత 70 లక్షల ఇచ్చి మోసపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గమ్మత్తేమిటంటే ఇప్పటికే ఈమె కుటుంబం పైన ఖమ్మం రూరల్‌, ఖమ్మం వన్‌టౌన్‌, ఖమ్మం త్రీటౌన్‌, కూసుమంచి, రఘునాథపల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలోనూ, సూర్యపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌ పోలీసుస్టేషన్‌లోనూ అనేక మోసాలకు సంబంధించిన కేసులు నమోదు కావడం విశేషం. వీరిలో ఏ2 పురాణం శివ, ఏ3 పురాణం శంకర్‌లను
కొద్ది రోజుల క్రితం ఖమ్మం రూరల్‌ సీఐ సత్యనారాయణరెడ్డి అరెస్టు చేయడంతో వీరి మోసాల కథలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మూడేళ్ల క్రితం రఘునాథపాలెం మండలం వేపగుంట్లలో రూ.1.8 కోట్ల విలువైన సరకును కొనుగోలు చేశారు. వీటికి చెల్లింపులు చేయాలంటూ సరకును చూపి ఖమ్మం రూరల్‌ మండలానికి చెందిన మాలోతు సునీతను నమ్మించి రూ.70 లక్షలు అప్పు తీసుకున్నారు.

పెంచుకున్న కుమార్తె ఫంక్షన్‌లో పురాణం శివకుమారి


పురాణం శివకుమారి కుటుంబం మోసాల స్టైల్‌ ఇదీ.. మోసాలకు పాల్పడడానికి అనువైన ప్రాంతాలపై అవగాహన పెంచుకున్న అనంతరం ఆమె కుటుంబం నేరుగా దగ్గరిలోని పల్లెటూర్లో అద్దెకు దిగుతుంది. తమకు కావాల్సిన సరకును బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేస్తే చాలా వృథా అవుతుందని.. అదే నేరుగా రైతుల నుంచి కొంటే తనకు లాభం.. రైతుకు సత్వర పేమెంట్‌ అంటూ చెబుతుంది. దీంతో బాటు తాను ఓపెన్‌ మార్కెట్‌లో పెద్దమొత్తంలో కొనుగోలు చేసిన ఆయిల్స్‌, చక్కెర, పప్పులను తాను అద్దెకు దిగిన ఇంటి ప్రాంగణంలోనే ఉదయం అన్‌లోడ్‌ చేయించి.. సాయంత్రమో.. లేక మర్నాడో తిరిగి లోడ్‌ చేయిస్తుంటుంది. ఇలా తన కెపాసిటీని చాటుకుంటుంది. దీంతోబాటు ఆమె లైఫ్‌స్టైల్‌ ఇంకా భిన్నం. డ్రైవర్‌, పనిమనిషి, సూపర్‌వైజర్ ఇలా ఆమె చుట్టూ ఉన్న అందరూ ఆమెను 'అమ్మా.. అమ్మా' అంటూ బిల్డప్‌ ఇస్తుంటారని.. దీంతో కొత్తగా పరిచయం అయినవారు సైతం ఆమెను అమ్మా అంటూ సంభోదించేలా ఆమె చుట్టూ ఒక కృత్రిమ గౌరవ వాతావరణాన్ని క్రియేట్‌ చేసి జనంలో పాపులర్‌ కావడం.. దీనికితోడు తాను పెంచుకుంటున్న ఓ అమ్మాయి ఫంక్షన్‌కు భారీ ఎత్తున ఖర్చు చేయడం.. ఆమె ముగ్గురు కుమారులు నిత్యం కారులో ఏసీ వేసుకుని గంటల తరబడి బీర్లు తాగుతూ గడపడం లాంటి విపరీత చేష్టలతో తనకున్న అపార ఆదాయ వనరుల ముందు ఈ ఖర్చు పెద్ద విషయం కాదన్న పిక్చర్‌ ఇచ్చిందని చెబుతున్నారు.

నిందితులను అరెస్టు చేసిన పోలీసులు


వేపగుంట్ల గ్రామంలోనే సుమారు ఐదు కోట్ల దాకా ఆమె ఎక్కడా సంతకం చేయకుండా అప్పు పుట్టించగలిగిందని.. దీనికోసం అదే గ్రామానికి చెందిన శ్రీనివాసరావు అనే ఓ రైతు మంచితనంతో తాను హామీగా అడ్డం ఉండి అంత మొత్తాలు ఊరి వాళ్ల నుంచి ఇప్పించి ఇరుక్కుపోయాడని విచారణలో తేలింది. ఇలా పురాణం శివకుమారి కుటుంబం బాధితుల వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సుమారు పదికోట్లకు పైగా ఆమెను నమ్మి నష్టపోయిన వారంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పటిదాకా మొత్తం ఏడు కేసులు నమోదు చేసుకున్న పోలీసులు శివకుమారి, మరో నిందితుడు పురాణం గోపీకృష్ణల కోసం వెతికే పనిలో పడ్డారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 7, 2020, 4:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading