శ్రీలంకలో వరుస పేలుళ్ల ఘటనల తర్వాత భారత్‌లోని దక్షిణాది రాష్ట్రాలను కేంద్ర నిఘా విభాగాలు అప్రమత్తం చేశాయి. ఉగ్రవాద దాడులు జరిగే అవకాశాలున్నాయని రాష్ట్రాలకు సమాచారం ఇచ్చాయి. దానికి తగ్గట్లు పోలీసులు ప్రత్యేక నిఘా చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటూ విచారణ చేపడుతున్నారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో గస్తీని రెట్టింపు చేశారు. అయితే, తాజాగా కేరళలో ఓ ఘటన ఆ రాష్ట్ర పోలీసులకు గుబులు పుట్టించింది. ఆ రాష్ట్రంలోని కొల్లాంలో ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ పేరు, చిత్రం ఉన్న కారు ఒకటి రోడ్లపై కనిపించింది. ఆ కారు వెనకాలే వెళ్లిన మరో కారులో ఉన్న వ్యక్తులు ఫోటో తీసి పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో ప్రయాణించిన ముగ్గురిని విచారించగా, ఓ వ్యక్తి వద్ద తాము అద్దె ప్రతిపాదికన తీసుకున్నామని వెల్లడించారు.
కారు యజమానిని కూడా అదుపులోకి తీసుకొని విచారించగా తాను పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తి వద్ద ఏడాది క్రితం కొన్నానని తెలిపాడు. దీంతో ఆ దిశగా విచారణ చేపట్టారు. కారు యజమాని, ప్రయాణికులను బెయిల్‌పై విడుదల చేసి, అవసరం అయినపుడు పోలీస్ స్టేషన్‌కు రావాలని ఆదేశించారు. అయితే, ఘటనను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా విచారణ చేపట్టాయి. కాగా, శ్రీలంక దాడుల అనంతరం కేరళలో హై అలర్ట్ ప్రకటించామని ఆ రాష్ట్ర డీజీపీ లోక్‌నాథ్ బెహరా తెలిపారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, కమెండోలు, బాంబ్ నిర్వీర్య బృందాలను అప్రమత్తం చేశామని వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAR, Kerala, Kollam S11p18, Sri Lanka, Sri Lanka Blasts, Terror attack, Terrorism