పుణె: కేరళలో ఇటీవల వరకట్న వేధింపులకు బలవుతున్న అబలల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పెళ్లి సమయంలో భారీగా కట్నకానుకలు ముట్టజెప్పినప్పటికీ పెళ్లయిన కొన్నాళ్లకే అత్తింటి నుంచి వేధింపులు, భర్త నుంచి చిత్రహింసలు కొందరు మహిళలకు తప్పడం లేదు. కేరళలో ఈ తరహా ఘటనలు ఇటీవల ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా.. కేరళకు చెందిన ఓ వివాహిత పుణెలోని భర్త నివాసంలో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన బాధిత కుటుంబంలో విషాదం నింపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్లాంకు చెందిన మధుసూదనన్, అంబికా దంపతులకు 27 ఏళ్ల వయసున్న ప్రీతి అనే కూతురు ఉంది. ఐదేళ్ల క్రితం ప్రీతిని అఖిల్ అనే యువకుడికి ఇచ్చి వివాహం చేశారు. అల్లుడికి పుణెలో ఉద్యోగం కావడంతో కూతురు సుఖంగా ఉండాలని, మంచి సంబంధమని నమ్మి భారీగా కట్నకానుకలు ముట్టజెప్పారు. రూ.85 లక్షల డబ్బు, 120 సవర్ల బంగారం కట్నంగా ఇచ్చారు. ప్రీతిని పెళ్లయిన కొన్నాళ్లు బాగానే చూసుకున్నప్పటికీ ఆ తర్వాత ఆమెకు అత్తింట్లో వేధింపులు మొదలయ్యాయి. పుణెలో భర్త, అత్తతో ఉన్న ప్రీతిని అదనపు కట్నం కోసం ఆమె భర్త, అత్త వేధించసాగారు.
ఇది కూడా చదవండి: Wife: మా ఆయనను వెంటనే అరెస్ట్ చేయండంటూ కమిషనర్ ఆఫీస్‌కు భార్య.. కారణం ఏంటంటే...
ఈ క్రమంలోనే.. ప్రీతి పుణెలో భర్త, అత్తతో కలిసి ఉంటున్న అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించింది. ఆమె చనిపోయిన విషయం కూడా అల్లుడి ద్వారా తెలియలేదని, వేరొకరి ద్వారా తెలుసుకోవాల్సి వచ్చిందని ప్రీతి తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు. వరకట్న వేధింపుల వల్లే తమ కూతురు బలయిపోయిందని, అఖిల్‌ను.. ఆమె తల్లిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రీతి మృతదేహాన్ని పుణె నుంచి కొల్లాంకు తరలించారు.
ప్రీతి మృతదేహంపై గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు. అత్తింటి వాళ్లే ఆమెను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ప్రీతి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అఖిల్, అతని తల్లి ప్రీతిని అదనపు కట్నం కోసం వేధించి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోస్ట్‌మార్టం అనంతరం ప్రీతి మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించగా.. ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ప్రీతి తండ్రి ఫిర్యాదు మేరకు అఖిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతని తల్లిని కూడా విచారిస్తామని పోలీసులు తెలిపారు.
కేరళలో విస్మయ అనే యువతి అదనపు కట్నం వేధింపులకు బలైన విషయం తెలిసిందే. కేరళలోని కొల్లాం జిల్లా సస్తంకొట్ట ప్రాంతానికి చెందిన ఎస్ కిరణ్ కుమార్‌కు, విస్మయ వి నాయర్(22) అనే యువతికి మార్చి 2020లో పెద్దల సమక్షంలో వివాహమైంది. అల్లుడు మోటార్ వెహికల్స్ డిపార్ట్‌మెంట్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తుండటంతో కూతురిని సుఖంగా చూసుకుంటాడని విస్మయ తల్లిదండ్రులు కట్నకానుకలు బాగానే ముట్టజెప్పారు. 100 సెవిరీల బంగారం, ఎకరానికి పైగా భూమి, టయోటా యారిస్ కారును కట్నంగా అల్లుడికి ఇచ్చారు. ఆ కారు సరిగ్గా మైలేజ్ ఇవ్వడం లేదని కిరణ్ చెప్పడంతో కారును కూడా మార్చి మరో కొత్త కారును కొనిచ్చారు. అల్లుడి అడిగినవన్నీ చేశారు. విస్మయ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ ఫైనలియర్ చదువుతోంది. పెళ్లయిన కొత్తలో భార్యతో సక్రమంగానే మెలిగిన కిరణ్ కొన్ని నెలలకే తన అసలు బుద్ధి బయటపెట్టాడు. కట్నం కోసం భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. చివరకు ఆమె చావుకు కారణమయ్యాడు. కేరళలో జూన్‌లో జరిగిన ఈ ఘటన అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: After marriage, Crime news, Dowry, Dowry harassment, Kerala