మధ్యాహ్నం ఫ్రెండ్స్‌తో లంచ్ చేస్తున్న యువతి.. ఇలా జరుగుతుందని ఊహించి ఉండదు.. నెల రోజులుగా ఆమెకు తెలియకుండానే..

హత్యకు గురైన మానస

ఇందిరా గాంధీ డెంటల్ కాలేజ్‌లో మానస విద్యను అభ్యసిస్తోంది. కాలేజ్‌కి సమీపంలోనే ఓ ఇంట్లో స్నేహితులతో కలిసి నివాసం ఉంటుంది.

 • Share this:
  ఓ వైద్య విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ఆమె నివాసం ఉంటున్న రూమ్ వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి... తుపాకీతో కాల్చి చంపాడు. ఆ తర్వాత అతను కూడా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన కేరళ ఎర్నాకుళంలోని కొత్తమంగళం ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు.. మానస, రాఖిల్‌‌లు కన్నూర్‌ జిల్లా తలస్సేరి ప్రాంతానికి చెందినవారు. మానస కొత్తమంగళంలోని ఇందిరా గాంధీ డెంటల్ కాలేజ్‌లో వైద్య విద్యార్థిని. ప్రస్తుతం ఆమె తన ఫ్రెండ్స్‌తో కలిసి కాలేజ్‌కు సమీపంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటుంది. వీరిద్దరికి గతంలో పరిచయం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే రాఖిల్ ఆమెను వేధింపులకు గురిచేశాడు. ఇందుకు సంబంధించి గతంలోనే మానస తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై.. రాఖిల్‌ పేరెంట్స్‌ రిక్వెస్ట్‌తో అతడిని పోలీసులు బెదిరించి వదిలేశారు. ఈ క్రమంలోనే రాఖిల్.. మానసపై కోపం పెంచుకున్నాడు. ఇక, రాఖిల్ నెల రోజుల క్రితం మానస ఉంటున్న చోటుకు చేరుకున్నాడు. ఆమె కదలికలపై నిఘా ఉంచేందుకు అదే ప్రాంతంలో ఓ ఇంట్లో దిగాడు.

  అయితే శుక్రవారం మధ్యహ్నం 3 గంటల సమయంలో మానస, తన ఫ్రెండ్స్‌తో కలిసి లంచ్ చేసింది. ఆ తర్వాత రాఖిల్ మానస వద్దకు చేరుకున్నాడు. రాఖిల్‌ను సడన్‌గా అక్కడ చూసిన మానస.. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఈలోపే రాఖిల్.. పక్కా ప్లాన్‌తో మానసను గదిలోకి తీసుకెళ్లాడు. దీంతో అప్రమత్తమైన మానస ఫ్రెండ్స్ ఈ విషయాన్ని ఇంటి యజమానికి తెలియజేయడానికి ప్రయత్నించారు. కానీ ఈలోపే వారికి తుపాకీ పేలుడు శబ్దం వినిపించింది. దీంతో వారు రూమ్ వద్దకు వచ్చి చూడగా.. మానస, రాఖిల్ ఇద్దరు నేలపై పడిపోయి కనిపించారు.

  మానస తలపై, ఛాతీ కింద భాగంలో రెండు బుల్లెట్స్ దూసుకుపోయాయి. అయితే మానస కొన ఊపిరితో ఉండటం చూసిన ఫ్రెండ్స్ వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమెను కాపాడలేకపోయారు. ఇక, వైద్యులు మానస, రాఖిల్ మరణించినట్టుగా ధ్రువీకరించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మానసను హత్య చేయాలనే ఉద్దేశంతోనే రాఖిల్ ఆ ప్రాంతంలో ఉంటూ.. ఆమె కదిలికలను గమనించేవాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తొలుత మానసపై కాల్పులు జరిపి, ఆ తర్వాత రాఖిల్ తనను తానే కాల్చుకున్నాడని పోలీసలు తెలిపారు.

  మరో నెల రోజుల్లో మానస హౌస్ సర్జన్ పట్టా పొందాల్సి ఉంది. ఈలోపై జరిగిన ఊహించని ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మానస కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇరువురు మృతదేహాలను పెరుంబవూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఉంచారు. కలమస్సేరీ వైద్య కళాశాలలో నేడు మానస, రాఖిల్ మృతదేహాలకు పోస్ట్‌మార్టమ్ నిర్వహించనున్నారు. అనంతరం మానస అంత్యక్రియలను కన్నూర్‌లో జరగనున్నాయి.
  Published by:Sumanth Kanukula
  First published: