చంద్రశేఖర్ గురూజీ (Vastu expert Chandrashekhar Guruji) వాస్తు నిపుణుడైన ఈ సిద్దాంతి గురించి కర్ణాటకలో తెలియని వారంటూ ఉండరు. ఆయన చెప్పే వాస్తు సూచనలు ఇతర భాషల్లోకీ ట్రాన్స్‌లేట్ అవుతున్నాయంటే పాపురాలిటీ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. యూట్యూబ్ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో లక్షలాది మంది ఫాలోవర్లు కలిగిన చంద్రశేఖర్ గురూజీ వాస్తు సూచనలను టీవీల్లో సైతం కోట్ల మంది వీక్షిస్తుంటారు. కర్ణాటకలోని వాస్తు నిపుణుల్లో దాదాపు టాప్ పొజిషన్ లో ఉన్న ఆయన అతి దారుణంగా హత్యకు గురయ్యారు. వాస్తు సూచనల కోసం భక్తుల ముసుగులో వచ్చిన దుండుగులు పట్టపగలే, కెమెరాల సాక్షిగా ఆయనను పొడిచిచంపారు. అయితే, హంతకులు గురూజీ మాజీ శిష్యులేనని వెల్లడైంది. వివరాలివే..
సరళవాస్తు నిపుణుడిగా కర్ణాటకలోనే కాక ఇతర రాష్ట్రాల్లో ఖ్యాతి పొందిన చంద్రశేఖర్ గురూజీ మంగళవారం పట్టపగలు దారుణ హత్యకు గురయ్యారు. హుబ్లీ జిల్లా కేంద్రంలోని ప్రెసిడెంట్ హోటల్‌లో ఈ దారుణం జరిగింది. ఆయన మాజీ శిష్యులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు రివీల్ చేశారు. చంద్రశేఖర్ గురూజీ దగ్గర పని చేస్తున్న మహంతేష్ శిరూర్, మంజునాథలను నిందితులుగా గుర్తించారు. పాపులర్ వాస్తు నిపుణుడి హత్య కర్ణాటకలో కలకలం రేపింది.
చంద్రశేఖర్ గురూజీని హుబ్లీలోని హోటల్ లో హతమార్చినప్పటి దృశ్యాలు సీసీటీవీ కెమెరాలకు చిక్కాయి. నిందితుల్లో ఒకడు.. గురూజీ కాళ్లకు మొక్కుతున్నట్లుగా నటించగా, మరొకరు చాకుతో పొడిచాడు. కిందకు పడినా కూడా వదలకుండా సుమారు 60 సార్లకు పైగా కత్తితో పొడిచి హోటల్ నుంచి తప్పించుకున్నారు. హత్యకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి.. హోటల్, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల సాయంతో నిందితులను వెంటాడారు. హత్య జరిగిన 4 గంటల్లోనే బెళగావి జిల్లా రామదుర్గ వద్ద ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు హుబ్లీ పోలీస్ కమిషనర్ లాభురాం వెల్లడించారు. కాగా,
వాస్తు నిపుణుడి హత్యకు ఆస్తి వివాదాలే కారణమని తెలుస్తోంది. చంద్రశేఖర్ గురూజీ శిష్యుల పేరిట బినామీ ఆస్తులు పెట్టారని, నిందితుడు మహంతేష్ పేరున కోట్లాది రూపాయల ఆస్తులున్నట్లు సమాచారం. కొంతకాలం కిందట మహంతేష్ ను శిష్యరికం నుంచి తొలగించిన గురూజీ.. తన ఆస్తిని తిరిగి ఇచ్చేయాలని ఒత్తిడి చేసేవారని, అందుకు మహంతేష్ నిరాకరిస్తున్నాడని, ఇదే విషయమై మాట్లాడడానికి హోటల్‌కు వచ్చిన సమయంలోనే హత్యాకాండ చోటుచేసుకుందని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karnataka, Murder case, Vastu