Karnataka Seer Arrest : కర్ణాటక(Karnataka)లో రాజకీయంగా శక్తివంతమైన లింగాయత్ కమ్యూనిటీకి చెందిన ప్రముఖ స్వామీజీ శివమూర్తి శరణారావు(Shivamurthy Sharanaru)ను ఎట్టకేలకు పోలీసులు గురువారం అరెస్టు(Arrest) చేశారు. స్వామీజీ శివమూర్తి తమపై అత్యాచారానికి పాల్పడ్డారని 6 రోజుల క్రితం ఇద్దరు మైనర్ బాలికలు(Two Minor Girls) కేసు పెట్టిన విషయం తెలిసిందే. మౌనర్ బాలికల ఆరోపణల నేపథ్యంలో స్వామీజీ శివమూర్తిపై ఇప్పటికే పోక్సో చట్టం కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే అతడిని ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడంపై పౌరసమాజం నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవడంతో గురువారం శివమూర్తిని అరెస్ట్ చేశారు పోలీసులు.
అసలేం జరిగింది
చిత్రదుర్గాలోని మురుగా మఠాధిపతి(Murugha Math) డాక్టర్ శివమూర్తి మురుగా శరణారావు(64)కు కర్ణాటకలో మంచి పేరుంది. ఎందరో ప్రముఖులు మురుగ రాజేంద్ర మఠానికి వస్తుంటారు. కొద్దిరోజుల క్రితమే రాహుల్‌గాంధీ ఈ మఠంలో శివదీక్ష తీసుకున్నారు. గతంలో అమిత్‌షా, నడ్డా లాంటి ప్రముఖులు కూడా మఠాన్ని సందర్శించారు. లింగాయత్ సామాజిక వర్గంలో ఈ మఠానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఆగస్టు 26న మురుగా మఠం ఆధీనంలోని అక్కమదేవి విద్యాసంస్థల్లో చదువుకుంటూ హాస్టల్‌లో ఉంటున్న ఇద్దరు మైనర్ అమ్మాయిలు..అయితే ఆగస్టు 26న మైసూరులోని ఓ స్వచ్ఛంద సంస్థ(NGO)ని ఆశ్రయించారు. చాలా ఏళ్లుగా డాక్టర్ శివమూర్తి తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆ బాలికలు ఆరోపించారు.. ఆశీర్వాదం పేరుతో తమను ప్రతివారం పిలిపించిన స్వామీజీ..తమపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధిత బాలికలు ఆరోపించారు. ఎన్జీవో సాయంతో బాలికలు పోలీస్ స్టేషన్ కు వెళ్లి డాక్టర్ శివమూర్తిపై కేసు పెట్టారు. ఇద్దరు బాలికల్లో ఒకరు దళిత కమ్యూనిటీకి చెందినవారు కావడంతో స్వామీజీ శివమూర్తిపై పోస్కో(POSCO)తో పాటు ఎస్సీ-ఎస్టీ చట్టం కింద పోలీసులు కేసు నమోదుచేశారు.
భూ వివాదం పరిష్కరించమని కోరిన దళిత కుటుంబం..ఫ్యామిలీ మొత్తాన్ని కాల్చిపారేస్తానన్న మంత్రి!
అయితే స్వామీజీని మాత్రం అరెస్ట్ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. చిత్రదుర్గ, మైసూరు జిల్లాల వ్యాప్తంగా పౌర సమాజం, వివిధ సంస్థలు పోలీసుల తీరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. అయితే శివమూర్తి స్వామీజీకి మాజీ సీఎం యడియూరప్ప సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆయనపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. దీంతో స్వామీజీ వ్యవహారంపై రాజకీయ రగడ రాజుకుంది. బాధితులను గట్టి భద్రత మధ్య చిత్రదుర్గ ఆశ్రమానికి తీసుకొచ్చి స్పాట్ ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆశ్రమంలో ఎక్కడ అఘాయిత్యం జరిగిందన్న విషయంపై విచారించారు. ఈ క్రమంలో గురువారం శివమూర్తి శరణారావును గురువారం రాత్రి 10.15 గంటల సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా కోర్టు అతడిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అంతకుముందు స్వామిజీ ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు ఆశ్రయించారు. అక్కడ చుక్కెదురు అయ్యింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మురుగా మఠం పరిపాలనా విభాగం అధికారికి, ఆయన భార్యకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
ఇక,సుదీర్ఘకాలంగా తనపై జరుగుతున్న కుట్రలో భాగమే ఇదంతా అని అరెస్ట్ కు ముందు శివమూర్తి మురుగా తెలిపారు. ఈ కేసు నుంచి తాను నిర్దోషిగా బయటపడతానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొవడం ఇదే తొలిసారి కాదని, గత 15 ఏళ్లుగా అనేక కుట్రలు చేశారని ఆరోపించారు. ఇన్నాళ్లూ లోపల జరుగుతున్న కుట్రలు ఇప్పుడు బయట కూడా సాగుతున్నాయి.. అన్ని సమస్యలకు తార్కిక ముగింపు ఉంటుందని అన్నారు. మురుగ మఠం చాలా కాలం క్రితం న్యాయం కోసం ఆశ్రయించిన వారికి న్యాయస్థానంగా కూడా పనిచేసిందని ఇప్పుడు అనారోగ్యకరమైన పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నుంచి నిర్దోషిగా బయటకు వస్తానని తనకు నమ్మకం ఉందని, ఎవరూ అసహనానికి గురికావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇటువంటి విపత్కర సమయంలో మురుగా స్వామి, మఠానికి మద్దతుగా నిలిచిన వారికి సెల్యూట్ చేస్తున్నానని స్వామీజీ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Karnataka, Minor girl raped