కొందరు పెళ్లయ్యాక జీవిత భాగస్వామికి తెలియకుండా ఇతరులతో రాసలీలలు కొనసాగిస్తున్నారు. అయితే చాలావరకు వివాహేతర సంబంధాలు విషాదాన్ని మిగిలుస్తున్నాయి. అయినా కూడా కొందరిలో మార్పు రావడం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలోని మైసూరులో చోటుచేసుకుంది. ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ.. అతడు తనకే సొంతం అని భావించింది. తాను చెప్పినట్టు చేయాలని అంక్షలు పెట్టింది. అయితే ఈ ఒత్తిడి భరించలేక అతడు ఆ మహిళను హత్య చేశాడు. వివరాలు.. పల్లవి అనే మహిళ మైసూరు ఐటీసీ ఫ్యాక్టరీలో కాంట్రాక్టు కార్మికురాలిగా పనిచేస్తోంది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే పల్లవికి, అదే కంపెనీలో డ్రైవర్గా పనిచేసే రవిచంద్రతో వివాహేతర సంబంధం ఏర్పడింది.
రవిచంద్రకు ఇంకా పెళ్లికాకపోవడంతో పల్లవి అతడు తనకే సొంతమని భావించింది.. ఈ క్రమంలో రవిచంద్రపై పల్లవి అంక్షలు పెట్టడం ప్రారంభించింది. అతని జీతం తనకే ఇవ్వాలని, తనతోనే ఉండాలని అతడిపై ఒత్తిడి చేసింది. అంతేకాకుండా ఎవరినీ పెళ్లి చేసుకోవద్దని కూడా అతడి కోరింది. అయితే పల్లవి చేసే ప్రతిపాదనలు నచ్చని రవిచంద్ర.. ఆమెను ఎలాగైనా అంతం చేయాలని భావించాడు.
ఈ క్రమంలోనే గత నెల 23వ తేదీన పల్లవిని హిమ్మాపు గ్రామ సమీపంలో ఎవరూ లేని చోటుకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను దారుణంగా హత్య చేశారు. ఇక, పల్లవి హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. నిందితుడు రవిచంద్రను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు.. గురువారం అతడిని అరెస్ట్ చేశారు.