MLC Kalvakuntla Kavitha: ఖతార్ నుంచి సొంతూరికి రప్పించి మరీ లక్షలు కాజేశారు.. ఎమ్మెల్సీ కవిత పేరుతో..

వినోద్, మహేశ్ గౌడ్, మధ్యలో బాధితుడు స్వామి

‘ఎమ్మెల్సీ కవిత మాకు బాగా తెలుసు. ఆమె పేరుతో ఉన్న ఓ యూట్యూబ్ చానెల్ కు నిన్ను చైర్మగా చేస్తాం. రెండు డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా ఇప్పిస్తాం. ఖతార్ లో ఎంత కాలం ఉంటావు. వచ్చేయ్’ అని ఫ్రెండ్స్ చెప్పడంతో సొంతూరికి వచ్చేశాడు. చివరకు..

 • Share this:
  వాళ్ళు ఓ యూట్యూబ్ ఛానల్ లో జర్నలిస్టులుగా పని చేస్తున్నారు. అమాయక ప్రజలను నమ్మించి మోసం చేయడంలో వారు దిట్ట. ఖతార్ లో డ్రైవర్ గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తిని ఛానల్ కు చైర్మన్ గా చేస్తామని మాయమాటలు చెప్పి నమ్మించి ఇండియాకు రప్పించారు. ఎమ్మెల్సీ కవిత ఫొటోతో పాటు బాధితుని ఫోటో పెట్టి ఓ ఛానల్ చైర్మన్ గా సరిఫికెట్ సృష్టించి నువ్వే ఛానల్ చైర్మన్ అని లక్షలు నొక్కేసారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండ గ్రామానికి చెందిన మహమ్మద్ అలియాస్ స్వామి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనిలో నివాసం ఉంటున్నాడు.

  చదువు పెద్దగా లేకపోవడంతో గల్ఫ్ దేశం ఖతార్ కు వలస వెళ్లి డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషించు కుంటున్నాడు. అయితే స్వామికి యూట్యూబ్ ఛానల్ లో పని చేసే వినోద్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అతని ద్వారా మహేష్ గౌడ్ అనే మరో యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టు స్వామికి బాగా నమ్మకస్థునిగా పరిచయం అయ్యాడు. ఖతార్ లో లో పని చేస్తున్న మహమ్మద్ అలియాస్ స్వామితో మహేష్ గౌడ్ ఫోన్లో మాట్లాడాడు. అక్కడ ఉండి ఎంత సంపాదిస్తావనీ, ఇండియాకు వచ్చేయమనీ చెప్పాడు. ‘మాకు ఓ యూట్యూబ్ చానెల్ ఉంది. ఎమ్మెల్సీ కవిత మాకు బాగా పరిచయం. ఆమె పేరుతోనే యూట్యూబ్ చానెల్ ఉంది. నిన్ను ఆ ఛానల్ కు చైర్మన్ ను చేస్తాము. కాస్త పెట్టుబడి పెడితే చాలు. రాయల్ లైఫ్ ఉంటుంది‘ అని నమ్మించాడు.

  నిజమేనని నమ్మిన బాధితుడు గత సంవత్సరం నవంబర్ నెలలో ఇండియాకు వచ్చాడు. అతడు రాగానే నువ్వు వచ్చావని ఎమ్మెల్సీ కవిత నీకు శాలువా పంపించిందని నమ్మబలికి ఇచ్చారు.. అతడిని ఛానల్ కు చైర్మన్ గా నియమించినట్టు కొన్ని పేపర్లను ఇచ్చారు. ఎమ్మెల్సీ కవిత ఫోటో, బాధితుని ఫొటోలతో కూడిన సర్టిఫికెట్ అందజేశారు. అలాగే కామారెడ్డిలో ఒకటి, వేములవాడలో ఒకటి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు వచ్చాయని వాటికి సంబంధించిన తాళాలను కూడా ఇచ్చారు. కవితక్కతో పర్సనల్ గా మాట్లాడవచ్చని చిన్న వాకిటాకీ అందజేశారు. ఇవన్నీ ఇచ్చి అతడి వద్ద సుమారు ఆరున్నర లక్షలు దండుకున్నారు. కొద్ది రోజులకు ఇదంతా మోసమని గ్రహించిన బాధితుడు మంగళవారం కామారెడ్డి పోలీసులను ఆశ్రయించాడు.

  మహేష్ గౌడ్, వినోద్ లు తనను మోసంచేశారని మహమ్మద్ అలియస్ స్వామి ఆవేదన వక్తం చేసాడు. ‘నాకు ముగ్గురు కూతుళ్ళు. కవితక్కా.. నాకు న్యాయం చెయ్యండి. నేను మోసపోయాను. వాళ్ల నుంచి నాకు ప్రాణహాని కూడా ఉంది.‘ అంటూ స్వామి వేడుకుంటున్నాడు. తన వద్ద దాదాపు ఆరు లక్షల యాభై వేలరూపాయలు తీసుకున్నారనీ, ప్రస్తుతం తన వద్ద చిల్లి గవ్వ కూడా లేదని వాపోతున్నాడు. కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తనలా ఎవరు మోసపోవద్దనే పోలీసులకు పిర్యాదు చేశానని బాధితుడు చెబుతున్నాడు. మహమ్మద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
  Published by:Hasaan Kandula
  First published: