ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడులపై విస్తృతమైన చర్చ జరగుతోంది. రాజకీయ లబ్ది కోసమే ప్రతిపక్షాలు ఈ చర్యలకు పాల్పడుతున్నాయని అధికారపక్షం వాధిస్తోంటే, ప్రభుత్వ వైఫల్యమే దీనికి కారణమని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. కాగా, కాకినాడలోని కొండయ్యపాలెంలోని నూకాలమ్మ ఆలయంలో అమ్మవారి చేతిలో ఉన్న త్రిశూలాన్ని ఎవరు దుండగులు విరగ్గొట్టారు. ఈ నెల పదో తారీఖున ఆ ఘటన జరగ్గా, ఈ దురాగతానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో ఆలయాలపై వరుస దాడులు జరుగుతండటంతో పోలీసు శాఖ అప్రమత్తమయింది. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల ముందు సీసీ కెమెరాలు పెట్టాలంటూ గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల ఫలితంగా నూకాలమ్మ ఆలయం ఎదుట కూడా సీసీ కెమెరాను పెట్టారు. ఇప్పుడు ఆ సీసీ కెమెరాయే నిందితుడిని పట్టించడం గమనార్హం.
జనవరి పదో తారీఖున ఉదయం ఆరు గంటలకు నూకాలమ్మ ఆలయానికి రోజూలాగానే పూజారి వెళ్లారు. ఆ సమయంలో ఆలయ ప్రధాన ద్వారం పక్కన ఉండే రెండు దేవతామూర్తుల విగ్రహాల చేతుల్లోని త్రిశూలాలు విరిగిపోయి ఉండటాన్ని పూజారి గమనించారు. దీంతో ఈ విషయమై ఆలయ కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాకినాడ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. అంతకుముందు ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు. దీంతో ఈ నిర్వాకానికి పాల్పడిన వ్యక్తి ఎవరన్నది గుర్తించారు. అదే గ్రామానికి చెందిన వనుము లక్ష్మణరావు అలియాస్ లచ్చన్న ఈ నిర్వాకానికి పాల్పడినట్టు తేల్చారు.
లచ్చన్నకు పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కుటుంబ కలహాల వల్ల లచ్చన్న భార్య ఎనిమిదేళ్లుగా అతడికి దూరంగా ఇంద్రపాలెం పీఎస్ పరిథిలో నివసిస్తోంది. మార్కెట్లో మేకలను కోయడం లచ్చన్న వృత్తి. అంతేకాకుండా ఇతర కూలి పనులకు కూడా వెళ్తుంటాడు. అలా వచ్చిన డబ్బుతో మద్యం తాగుతుంటాడు. అప్పుడప్పుడు నూకాలమ్మ ఆలయం, శారదాంబ ఆలయం వద్ద కూడా పడుకునేవాడు.
జనవరి తొమ్మిదో తారీఖున అతడు బాగా మద్యం సేవించి, స్నేహితుడి సైకిల్ తీసుకుని నూకాలమ్మ ఆలయం వద్దకు వచ్చాడు. ఆ రాత్రి 10.20 గంటల నుంచి 10.30 గంటల సమయంలో తనలో తానే మాట్లాడుకుంటూ నూకాలమ్మ ఆలయం వద్దకు వచ్చాడు. ప్రధాన ద్వారం పక్కన ఉన్న విగ్రహాలతో మాట్లాడుతూ ఆ విగ్రహాల చేతుల్లో ఉన్న త్రిశూలాన్ని విరగ్గొట్టాడు. ఆ తర్వాత కాసేపటికే వెళ్లిపోయాడు. ఆసమయంలో అటుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు అతడిని చూశారు కానీ, మద్యం మత్తులో ఉన్న అతడిని ఎవరూ ఆపలేదు. సీసీ కెమెరాలను పరిశీలించిన తర్వాత పోలీసులు లచ్చన్నను అరెస్ట్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP Temple Vandalism, Bjp-janasena, Chandrababu naidu