news18-telugu
Updated: November 14, 2020, 9:41 PM IST
ప్రతీకాత్మక చిత్రం
అరచేతిలో ప్రపంచాన్ని చూస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో.. ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. చంద్రుడిపైకి రాకెట్లు పంపుతున్న హైటెక్ కాలంలో.. పాతకాలపు పాచిపోయిన అంధ విశ్వాసాలు జడలు విప్పుతున్నాయి. ముఖ్యంగా బీహార్, ఝార్ఖండ్ వంటి ప్రాంతాల్లో అత్యాధునిక వైద్యం కంటే.. నాటు మందులు, మంత్ర తంత్రాలే.. ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా ఝార్ఖండ్‌లోని లోహర్‌దంగా జిల్లాలో ఘోరం జరిగింది. కొడుకు పుడతాడన్న ఆశతో.. మంత్రగాడి మాటలు నప్పి.. ఆరేళ్ల కూతురిని చంపేశాడో తండ్రి. గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు.
పెష్రార్ మండలానికి చెందిన 26 ఏళ్ల సుమన్ నగాసియా కూలీగా పనిచేస్తున్నాడు. సుమన్‌కు ఆరేళ్ల కూతురు ఉంది. కానీ అతడికి మాత్రం కొడుకే కావాలని ఉంది. తదుపరి తమకు పుట్టబోయే బిడ్డ కొడుకే కావాలని ఇటీవల ఓ బాబాను సంప్రదించాడు. ఐతే కొడుకు పుట్టాలంటే కూతురిని బలివ్వాలని సలహా ఇస్తాడు. కూతురిని బలిస్తే నీ కోరిక నెరవేరుతుందని చెప్పాడు. ఆ మంత్రగాడి మాటలు నమ్మిన సుమన్ నగాసియా.. అతడు చెప్పినట్లు చేశాడు. ఇంట్లో భార్య లేని సమయం చూసి కూతురి గొంతుకోసి చంపేశాడు. కన్న కూతున్న జాలి దయ కూడా లేకుండా దారుణంగా హత్య చేశాడు.
భార్య ఇంటికి వచ్చే సరికి.. కూతురు రక్తపు మడుగుల్లో పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఐతే అప్పటికే సుమన్ నగాసియా ఇంటి నుంచి పారిపోయాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సుమన్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. పరారీలో ఉన్న బాబా కోసం గాలిస్తున్నారు. బాలిక మృతదేహానికి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Published by:
Shiva Kumar Addula
First published:
November 14, 2020, 9:37 PM IST