news18-telugu
Updated: October 1, 2020, 1:31 PM IST
ప్రతీకాత్మక చిత్రం
సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకుని తొమ్మిది మందిని ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేశాడు. ఈ కేసులో నిందితుడైన జాపాన్ కు చెందిన ట్విట్టర్ కిల్లర్ తకాహిరో షిరాయిషిని బుధవారం పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ విషయాన్ని అక్కడి స్థానిక మీడియా తెలిపింది. అయితే బాధితుల అంగీకారంతోనే నిందితుడు ఈ హత్యలకు పాల్పడ్డాడని అతని తరఫు లాయర్ కోర్టులో వాదనలు వినిపించడం సంచలనంగా మారింది. షిరాయిషితో పలువురు తాము ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలను పంచుకోవడం కారణంగా అతను ఈ హత్యలు చేశాడని కోర్టుకు లాయర్ తెలిపాడు. ఈ కారణంగా నిందితుడికి ఉరిశిక్షకు బదులుగా ఆరు నెలల నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్ష మాత్రమే విధించాలని కోర్టును కోరాడు.
మానసిక ఒత్తిడి, వేదనల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలని భావించిన 15 నుంచి 26 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారిని నిందితుడు షిరాయిషి ట్విట్టర్ ద్వారా సంప్రదించాడని ఆరోపణలు ఉన్నాయి. ఆత్మహత్య చేసుకోవడానికి సహకరిస్తానని వారికి చెప్పినట్లు సమాచారం. తాను సైతం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానని వారిని నమ్మబలికి హత్యలు చేసినట్లు అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో దోషిగా తేలితే షిరాయిషికి ఉరిశిక్ష విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.
మూడేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్లు 23 ఏళ్ల ఓ మహిళ ట్వీట్ చేసింది. అనంతరం ఆ మహిళ కనిపించకుండా పోయింది. బాధితురాలి సోదరుడికి అనుమానం వచ్చి ఆమె ట్విట్టర్ ఖాతాను తనిఖీ చేశాడు. దీంతో ఆమె షిరాయిషితో తరచుగా మాట్లాడినట్లు తెలియడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో అనేక షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. నిందితుడి ఇంటి కింది భాగంలో సీక్రెట్ గదిని గుర్తించగా.. అందులో 9 మృతదేహాలు బయటపడ్డాయి. ముక్కలుగా చేసిన శరీర భాగాలు, 240 ఎముకలను బాక్సుల్లో దాచి ఉంచిన విషయం సైతం వెలుగులోకి వచ్చింది.
అయితే షిరాయిషి లాయర్ మాత్రం.. బాధితుల సమ్మతితోనే వారి హత్యకు అతడు సహకరించాడని వాదిస్తుండడం గమనార్హం. షిరాయిషి మాత్రం తన లాయర్ వాదనలు సరైనవి కాదనడం కేసులో మరో ట్విస్ట్ గా మారింది. తాను బాధితుల నుంచి ఎలాంటి అంగీకారం తీసుకోకుండానే వారిని చంపానని అతడు చెబుతున్నాడు. చనిపోయిన వారి తల వెనక భాగంలో గాయాలు ఉన్నాయని.. దీని ఆధారంగా వారి సమ్మతి లేకుండానే చంపేశానని భావించాలని కోరుతున్నాడు. అయితే ఈ కేసులో కోర్టు ఎలాంటి శిక్ష ఖరారు చేస్తుందన్న అంశం ఆసక్తికరంగా మారింది.
Published by:
Nikhil Kumar S
First published:
October 1, 2020, 1:24 PM IST