ఓ జనసేన కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు. వైసీపీ ఎమ్మెల్యే తిట్టడం వల్లే తమ పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో చోటుచేసకుంది. వివరాలు.. జిల్లాలోని బేస్తవారపేట మండలంలోని సింగరపల్లి గ్రామానికి చెందిన బండ్ల వెంగయ్య ప్రైవేటు బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కుటుంబంతో కలిసి పామూరులో నివాసం ఉంటున్నాడు. ఇటీవల సంక్రాంతి పండగ సందర్భంగా వెంగయ్య కుటుంబంతో కలిసి సొంతూరుకు వచ్చాడు. అయితే శుక్రవారం వెంగయ్య మరికొందరు జనసేన కార్యకర్తలతో కలిసి వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు కారును అడ్డగించారు. గ్రామంలో పారిశుద్ధ్యం, రోడ్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అయితే తన కారును అడ్డగించిన వారిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ క్రమంలోనే వెంగయ్యతో పాటు మరికొందరు జనసేన నాయకులు.. స్థానికంగా ఉన్న వైసీపీ నాయకుల వద్దకు వెళ్లారు. అయితే అక్కడ వైసీపీ నాయకులు దౌర్జన్యానికి దిగడంతో పాటుగా, వెంగయ్య పట్ల అనుచితంగా ప్రవర్తించారని జనసేన నేతలు ఆరోపించారు. అందువల్లే వెంగయ్య మనస్తాపానికి గురై సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ బెల్లంకొండ అన్నారు. కారును అడ్డుకున్నందుకు వెంగయ్యను వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు బూతులు తిట్టారని చెప్పాడు. ఆ బెదిరింపులకు భయపడి వెంగయ్య ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. వెంగయ్య ఆత్మహత్యకు సంబంధించి సీబీఐ విచారణ చేపించాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి: పవన్ కల్యాణ్
ఈ ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) కూడా స్పందించారు. ప్రశ్నిస్తే ప్రాణాలు కోల్పోవాల్సిందేనా అని ప్రశ్నించారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు బెదిరింపులతోనే వెంగయ్య ఆత్మహత్య చేసుకున్నట్టు తమకు సమాచారం ఉందన్నారు. బెదిరింపులతో వెంగయ్యను ఆత్మహత్యకు ప్రేరేపించిన ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు వెంగయ్య ఆత్మహత్యతో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది. అయితే వెంగయ్య ఆత్మహత్య చేసుకోవడానికి వారు చెబుతున్న కారణాలు మరోలా ఉంది. మద్యం తాగొద్దని చెప్పినందుకే మనస్తాపానికి లోనై ఆత్మహత్య చేసుకున్నాడని వారు తెలిపారు.
Published by:Sumanth Kanukula
First published:January 19, 2021, 07:23 IST