JAMMU KASHMIR TWO NON LOCALS SHOT AT AND INJURED BY TERRORISTS IN PULWAMA MKS
Jammu Kashmir: స్థానికేతర కూలీలపై ఉగ్రవాదుల కాల్పులు -Pulwamaలో తాజా ఘటన
ప్రతీకాత్మక చిత్రం
జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. స్థానికేతరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. పంజాబ్ కు చెందిన ఇద్దరు కార్మికులు ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడ్డారు. వివరాలివే
కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత స్థానికేతరుల రాక పెరిగిందనుకునేలోపే లక్ష్యం మార్చి కూలీలపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా పుల్వామా జిల్లాలో ఆదివారం రాత్రి మరో ఘటన జరిగింది. ఉగ్రవాదులు స్థానికేతరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు.
పుల్వామా జిల్లాలో లిట్టర్ ప్రాంతంలోని నౌపోరాలో ఇద్దరు కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆదివారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరిని తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఛాతికి బుల్లెట్ గాయాలైన ఒకర్ని శ్రీనగర్‌లోని ప్రత్యేక ఆసుపత్రికి రిఫర్ చేశారు. మరో వ్యక్తి కాలికి బుల్లెట్ గాయమైంది.
కాశ్మీర్ లో ఉగ్రవాదుల తూటాలకు గాయపడ్డ ఇద్దరు స్థానికేతరులను పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు చెందిన ధీరజ్ దత్, సురీందర్ సింగ్‌గా గుర్తించినట్లు జమ్ముకాశ్మీర్ పోలీసులు తెలిపారు. స్థానిక కోళ్ల ఫారం వాహనం డ్రైవర్‌గా ఒకరు, సహాయకుడిగా మరొకరు పని చేస్తున్నట్లు చెప్పారు.
కాగా, స్థానికేతరులైన ఇద్దరు కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జమ్ముకాశ్మీర్ పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతానికి అదనపు బలగాలను రప్పించి ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లు పేర్కొన్నారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.