Student and His Friend Blackmailed businessaman : ఒక వ్యాపారవేత్తను ఒక సంవత్సరం పాటు బ్లాక్‌మెయిల్ చేసి లక్షల రూపాయలను దోపిడీ చేసిన హై ప్రొఫైల్ కేసును రాజస్తాన్(Rajasthan) పోలీసులు బయటపెట్టారు. ఈ కేసుకి సంబంధించి సీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న రోహిత్ బోహ్రా అనే యువకుడిని, ప్రియాంక అనే అమ్మాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జైపూర్ లోని విశ్వకర్మ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..రాహుల్ బోహ్రా అనే యువకుడి సోదరి ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తుండేది. రాహుల్ సోదరితో పాటు ప్రియాంక అనే ఓ యువతి కూడా ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. రాహుల్ సోదరి,ప్రియాంక ఇద్దరూ ఒకరికొకరు మంచి స్నేహితులు. అలా రాహుల్ కి కూడా ప్రియాంక మంచి ఫ్రెండ్ అయ్యింది. అప్పుడప్పుడు ప్రియాంక ను కలిసేందుకు రాహుల్ ఫ్యాక్టరీకి వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో ఫ్యాక్టరీ యజమాని వ్యాపారవేత్త దీపక్ మహేశ్వరి ధనవంతుడని రాహుల్‌కు సమాచారం అందింది. దీంతో రాహుల్ మనసులో దురాశ మొదలైంది. ప్రియాంకతో పాటు వ్యాపారవేత్తను బ్లాక్ మెయిల్ చేయాలని ప్లాన్ చేశాడు. ప్రియాంక ద్వారా వ్యాపారవేత్త దీపక్ మహేశ్వరి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించాడు. ఆ తర్వాత నవంబర్ 1,2021న సినిమా స్టైల్‌లో మూసి ఉన్న కవరులో ఒక బెదిరింపు లేఖను ఆటో డ్రైవర్ ద్వారా వ్యాపారవేత్త ఫ్యాక్టరీకి మధ్యాహ్నం 1 గంటలకు పంపారు. గార్డుకు బెదిరింపు లేఖ ఇచ్చి ఆటో డ్రైవర్ వెళ్లిపోయాడు. ఈ కవరులో వ్యాపారవేత్త వ్యక్తిగత సమాచారాన్ని వైరల్ చేస్తానని బెదిరించి రూ.11 లక్షలు దోపిడీ చేశాడు. ఆ తర్వాత 2021 నవంబర్ 15న మళ్లీ మూసి ఉన్న కవరు పంపి 15 లక్షల 25 వేల రూపాయలు వసూలు చేశారు. తాజాగా మూడోసారి డిసెంబర్ 26న వ్యాపారిని బెదిరించి రూ.23 లక్షలు డిమాండ్ చేశాడు. ఈ మొత్తాన్ని జనవరి 5వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు విద్యాధర్ నగర్ ప్రాంతంలోని ఓ షోరూమ్ ముందు చెట్టు కింద ఉంచాలని కోరారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వ్యాపారవేత్త మహేశ్వరి విశ్వకర్మ పోలీస్‌స్టేషన్ ఇన్‌ఛార్జ్ రమేష్ సైనీని కలిసి తనకు ఎదురైన కష్టాలను వివరించారు.
పోలీసులు కేసు నమోదు చేసి నిందితులని పట్టుకునేందుకు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా జనవరి 5వ తేదీ రాత్రి 1గంట సమయంలో సదరు వ్యాపారి విద్యాధర్ నగర్ ప్రాంతంలోని అదే ప్రదేశానికి నిందితుడు రాహుల్ డబ్బులు ఇవ్వాలని కోరిన బ్యాగులో నోట్లకు బదులు పేపర్ కట్టలు నింపుకుని చేరుకున్నాడు. రాహుల్ బోహ్రా తెల్లవారుజామున 1 గంటలకు తన కారుతో సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. బ్యాగ్ తీసుకుని రాహుల్ వెళ్లడం ప్రారంభించిన వెంటనే విశ్వకర్మ పోలీస్ స్టేషన్ అధికారులు రాహుల్ ను పట్టుకున్నారు. అతడిని ప్రశ్నించడంతో అతని సహచరురాలు ప్రియాంక హస్తం కూడా ఇందులో ఉందని గుర్తించి ఆమెను కూడా పోలీసులు పట్టుకున్నారు. ఇందులో ప్రత్యేక బృందంలోని హెడ్ కానిస్టేబుల్ కరణ్ సింగ్ షెకావత్ కీలక పాత్ర పోషించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Rajastan