శ్రీలంక వరుస పేలుళ్లలో 290 మందికి పైగా దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ దాడుల వెనుక ఐఎస్ ఉగ్రవాద సంస్థ హస్తం ఉందని ఇప్పటి వరకు ఆధారాలు లభించగా, వరుస పేలుళ్లకు పాల్పడింది తామేనని ఆ సంస్థ మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు అమాఖ్ న్యూస్ ఏజెన్సీ ద్వారా ఈ ప్రకటన చేసింది. కాగా, ఈ దారుణ మారణహోమం వెనుక స్థానిక ముస్లిం వేర్పాటువాద సంస్థ ప్రమేయం ఉందేమోనని శ్రీలంక ప్రభుత్వం అంతకుముందు అనుమానాలు వ్యక్తం చేసింది. నేషనల్ తౌవీత్ జమాత్(ఎన్టీజే) అనే అతివాద ముస్లిం వేర్పాటువాద సంస్థ హస్తం ఉండొచ్చని శ్రీలంక మంత్రి, ప్రభుత్వ అధికార ప్రతినిధి రజితా సేనరత్నే సోమవారం మీడియాకు వెల్లడించారు. ఈ సంస్థకు అంతర్జాతీయ సాయం అందిందా? అనే అంశంపై కూడా ఆరా తీశారు.
నేషనల్ తౌవీత్ జమాత్ సంస్థ గురించి శ్రీలంకలో కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. గతంలో బౌద్ధ విగ్రహాలను ధ్వంసం చేయడం ద్వారా ఆ సంస్థ వార్తల్లో నిలిచేది. శ్రీలంకలో ఆదివారం నాటి మారణహోమం ఘటన తర్వాత ఎన్టీజేకు చెందిన 24 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.అటు ఉగ్రదాడి ఘటనల నేపథ్యంలో దేశంలో సోమవారం అర్థరాత్రి నుంచి అత్యవసర పరిస్థితిని అమలు చేసిన సంగతి తెలిసిందే. ఇక, పేలుళ్లలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 290 మందికి పైగా చనిపోగా అందులో 35 మంది విదేశీయులు ఉన్నారు. 9 మంది భారతీయులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Columbo Bomb Blast, Sri Lanka, Sri Lanka Blasts, Terror attack