రైలులో ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో కలకలం సృష్టించింది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా - చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు మధ్య హౌరా మెయిల్‌ను ప్రతిరోజూ నడుపుతున్నారు. హౌరా నుంచి ఈ రైలు మంగళవారం వేకువజామున 3.20 గం.లకు చెన్నై రైల్వే స్టేషన్‌లోని నాలుగో ప్లాట్‌ఫాంకు చేరుకుంది. జనరల్ కోచ్‌లోని మరుగుదొడ్డికి వెళ్లిన ఓ ప్రయాణీకురాలు... చాలా సేపటి తర్వాత కూడా బయటకు రాలేదు. మరుగుదొడ్డి తలుపుకొట్టినా లోపలి నుంచి సమాధానం లేకపోవడంతో అనుమానం చెందిన ఓ ప్రయాణీకుడు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రైల్వే మెకానిక్‌ని పిలిపించిన పోలీసులు...మరుగుదొడ్డి తలుపును తెరచిచూసి విస్మయం చెందారు. మరుగుదొడ్డి లోపు 35 ఏళ్ల వయస్కురాలైన ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వైద్యులను పిలిపించగా...అప్పటికే ఆ మహిళ తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు నిర్థారించారు. ఆత్మహత్యకు పాల్పడిన మహిళ ఎవరు? ఆమె ఆత్మహత్యకు కారణాలపై రైల్వే పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. రైలులో ప్రయాణించిన ఓ మహిళ మరుగుదొడ్డిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చెన్నై రైల్వే స్టేషన్లో కలకలం సృష్టించింది.