జోధ్‌పూర్: రానురానూ మనుషుల మధ్య బంధాలకు, స్నేహానికి విలువ లేకుండా పోతోంది. కుటుంబంతో పంచుకోలేని విషయాలను కూడా స్నేహితులతో చెప్పుకుంటూ ఉంటారు. స్నేహానికి ఇచ్చే విలువ అలాంటిది. అలాంటి స్నేహితుడికి ఓ యువకుడు వెన్నుపోటు పొడిచాడు. ఆ స్నేహితుడు ప్రియురాలితో వెళ్లిపోయాడు. సదరు యువకుడికి 15 రోజుల్లో మరో యువతితో పెళ్లి జరగాల్సి ఉంది. ఈ ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పబూపుర ప్రాంతానికి చెందిన బదల్ నాయక్ అనే యువకుడికి నవంబర్ 14న పెళ్లి జరగాల్సి ఉంది. బదల్కు అమిత్ అనే స్నేహితుడు ఉన్నాడు. ఇద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారు. ఎలాంటి దాపరికాలు లేకుండా కలిసిమెలిసి అన్నీ చెప్పుకునేవారు. అమిత్ కొన్నేళ్ల క్రితం ఓ యువతిని ప్రేమించాడు. ఆ యువతి కూడా ప్రేమించడంతో ఇద్దరూ కొన్నాళ్లు ప్రేమాయణం సాగించారు.
అయితే.. ఒకానొక సమయానికి ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత తన స్నేహితుడికి తెలియకుండా బదల్ ఆ యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరి మధ్య ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. దాదాపు ఆరేళ్ల నుంచి ఆ యువతితో బదల్ ప్రేమలో మునిగితేలుతున్నాడు. అయితే.. ఇటీవల బదల్కు మరో యువతితో తల్లిదండ్రులు పెళ్లి నిశ్చయించారు. ఆ యువతితో నిశ్చితార్థం కూడా జరిపించారు.
ఈ విషయం తెలిసిన బదల్ ప్రియురాలు తనను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మరో యువతితో పెళ్లికి సిద్ధపడుతున్నావేంటని బదల్ను నిలదీసింది. తనకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోనని.. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. దీంతో.. నవంబర్ 14న పెళ్లి పెట్టుకున్న నేపథ్యంలో బదల్, అతని స్నేహితుడి మాజీ ప్రియురాలు ఇద్దరూ వెళ్లిపోయారు. దీంతో.. తనకు కాబోయే భర్త ఇలా చేశాడని తెలుసుకున్న బదల్ కాబోయే భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీళ్లిద్దరినీ ఎక్కడికి వెళ్లిపోయిందనే విషయాన్ని పోలీసులు కనిపెట్టారు. ఇద్దరినీ తీసుకొచ్చారు.
తనతో నిశ్చితార్థం చేసుకుని మోసం చేశాడని బదల్తో నిశ్చితార్థం చేసుకున్న యువతి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బదల్ నాయక్‌పై చీటింగ్ కేసు నమోదు చేశారు. బదల్ను పోలీస్ స్టేషన్‌కు తరలించిన సమయంలో ఓ ఘటన జరిగింది. అతనితో నిశ్చితార్థం చేసుకున్న యువతి కూడా అక్కడికి వచ్చింది. బదల్కు ఆ చెంప, ఈ చెంప వాయించింది. బదల్కు వెళ్లిపోయిన యువతిని పోలీసులు ఇప్పుడేం చేద్దామని ప్రశ్నించగా.. తన కుటుంబ సభ్యుల దగ్గరకి వెళ్లిపోతానని ఆ యువతి చెప్పింది. దీంతో.. ఆమెను కుటుంబం దగ్గరకు పోలీసులు పంపించారు. బదల్తో నిశ్చితార్థం జరిగిన యువతి మాట్లాడుతూ.. అతనితో మూడేళ్ల క్రితం నిశ్చితార్థం జరిగిందని.. పెళ్లి చేసుకుని సంతోషంగా కలిసి ఉందామని ఇన్నాళ్లుగా తనను నమ్మించి తీరా పెళ్లి మరో 15 రోజుల్లో ఉందనగా మరో యువతితో వెళ్లిపోయి తనను మోసం చేశాడని ఆ యువతి పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Girlfriend, Lover, Marriage