రోజు రోజుకు కొత్త తరహా మోసాలు వెలుగు చూస్తున్నాయ్. కేటుగాళ్లు ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో భారీ మోసం ఒకటి వెలుగు చూసింది. ఆ జిల్లా ప్రైమరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తి భారీ మోసానికి తెరలేపాడు. పలువురు ఉపాధ్యాయుల పేరిట 5,000 పెయిడ్ లీవ్స్ చూపించి.. వాటి ద్వారా రూ.10 కోట్లు కాజేశాడు. ఈ భారీ మోసాలకు పాల్పడిన వ్యక్తిని రాజేష్ రామిగా పోలీసులు గుర్తించారు. అతడు రూ.10 కోట్ల కంటే ఎక్కువ డబ్బులనే అక్రమంగా తరలించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ మోసగాడిపై ఇప్పటికే 3 సంబంధిత కేసులు నమోదు చేశారు. రాజేష్ అహ్మదాబాద్ జిల్లాలోని మొత్తం 8 మండలాల్లో పనిచేసే ఉపాధ్యాయుల పేరిట నకిలీ పెయిడ్ లీవ్స్ సృష్టించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. రాజేష్ 2016-17, 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో 3 మండలాల ఉపాధ్యాయుల పేరిట మోసాలకు పాల్పడ్డాడని జిల్లా పంచాయతీ కార్యాలయ అధికారి తెలిపారు. అతడు రూ.9.99 కోట్ల మోసాలకు పాల్పడ్డాడని డాక్యుమెంట్స్ ప్రకారం తెలిసిందన్నారు. నిందితుడు ఇంకా ఎక్కువ మోసాలకు పాల్పడి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. జూలై 15న కరంజ పోలీస్ స్టేషన్ లో రాజేష్ పై ఫ్రాడ్, చీటింగ్ కేసు నమోదయ్యింది. నకిలీ పెయిడ్ లీవ్స్ ఎన్కాష్మెంట్ రికార్డులు సబ్మిట్ చేసి రూ.7 కోట్లు కాజేశాడని అతనిపై ఆరోపణలు వచ్చాయి. 2016-17 ఆడిట్ నివేదికలో అతడు చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. అప్పుడు అకౌంట్ బుక్స్ పరిశీలించినప్పుడు.. కోట్ల రూపాయలు పక్కదారి పట్టినట్లు తెలిసింది.
ప్రాథమిక విచారణ ప్రకారం.. నిందితుడు అనేక ఉపాధ్యాయుల పేర్లను కాపీ చేయగలిగాడు. ఆ తర్వాత వారి పేర్ల మీద నకిలీ పెయిడ్ లీవ్స్ అప్లికేషన్ సబ్మిట్ చేసేవాడు. అయితే అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు ఉపాధ్యాయుల బ్యాంక్ ఖాతా నంబర్ తీసేసి.. తన బ్యాంకు అకౌంట్ నెంబర్ ఇచ్చేవాడు. పెయిడ్ లీవ్స్ ద్వారా అందే డబ్బును కాజేయడానికి అతడు తన లేదా తన కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలకు డబ్బులు బదిలీ చేసేవాడు. డిప్యూటీ అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు కాబట్టి అకౌంటింగ్ పనిని మానిటరింగ్ చేస్తూ అవకతవకలను సరిచేసేవాడు.
ఇటీవల అహ్మదాబాద్ జిల్లా డెట్రోజ్ తాలూకాకు చెందిన ఉపాధ్యాయుల పేరిట రూ .2.69 కోట్లు, రూ .30 లక్షలు కాజేసేందుకు రాజేష్ ఇదే విధానాన్ని అనుసరించాడు. కానీ డబ్బులు దొంగలించడం లో విఫలమై పోలీసులకు చిక్కాడు. అయితే ఇంత పెద్ద ఫ్రాడ్ చేయడం ఒక్కడి వల్ల అయ్యే పని కాదని పోలీసులు, విద్యా శాఖ అధికారి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కువ మంది పాల్గొన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రధాన నిందితుడు రాజేష్ మాత్రం ఇంకా పరారీలో ఉన్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ahmedabad, Crime news, Fraud, Gujarat