news18-telugu
Updated: October 6, 2020, 8:45 AM IST
ప్రతీకాత్మక చిత్రం
ఇటీవల కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలో జరిగిన ఎర్రొల్ల స్వామిగౌడ్ హత్యకేసును పోలీసులు చేధించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని స్వామిగౌడ్ భార్యే అతన్ని హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ హత్య కేసుకు సంబంధించిన వివరాలను భిక్కననూర్ సీఐ యాలాద్రి సోమవారం మీడియాకు వెల్లడించారు. "భిక్కనూర్ మండలం కాచాపూర్‌కు చెందిన హన్మాగౌడ్.. వరుసకు బంధువైన ముత్యంపేట గ్రామానికి చెందిన స్వామిగౌడ్ భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. స్వామిగౌడ్ కొన్నేళ్లుగా కరీంనగర్ ప్రాంతంలో పనిచేసేవాడు. అయితే లాక్డౌన్ అప్పటి నుంచి ముత్యంపేటలోని ఇంటివద్దే ఉంటున్నాడు. అయితే స్వామిగౌడ్ ఇంటివద్ద ఉండటంతో అతని భార్యను కలవడానికి హన్మాగౌడ్కు కష్టంగా మారింది. దీంతో వారి అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న స్వామిగౌడ్‌ను అంతమొందించాలని హన్మాగౌడ్ ప్లాన్ వేశాడు.
ఇందుకోసం తన ఊరికే చెందిన బండారి మల్లేషం, క్యాసంపల్లి తండాకు చెందిన బుక్యా పకీరా, బుక్యా బాల్యతో కలిసి స్వామిగౌడ్‌ను హత్య చేయాలని డిసైడ్ అయ్యాడు. వారితో లక్ష రూపాయలకు డీల్ కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలోనే కల్లులో కలిపే మత్తుమందు వ్యాపారం చేద్దామని స్వామిగౌడ్‌ను హన్మాగౌడ్ నమ్మించాడు. ఇందుకోసం వెళ్తున్నట్టు తీసుకెళ్లి గత నెల 30న స్వామిగౌడ్‌ను రాఘవపూర్ శివారుకు తీసుకెళ్లాడు. అక్కడ హన్మాగౌడ్తోపాటు అతడితో డీల్ కుదుర్చుకున్న వ్యక్తులు స్వామిగౌడ్‌పై దాడికి దిగారు. గొంతు నులమడంతోపాటుగా, కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి దారుణంగా హత్య చేశారు" అని సీఐ తెలిపారు.
ఈ కేసులో నిందితులుగా ఉన్న హన్మాగౌడ్, బండారి మల్లేషం, బుక్యా బాల్యలను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ వెల్లడించారు. మరో నిందితుడు బుక్యా పకీరా పరారీలో ఉన్నట్టు తెలిపారు.
Published by:
Sumanth Kanukula
First published:
October 6, 2020, 8:45 AM IST