ఈ సమాజంలో నేరాలు, ఘోరాలు ఎన్నో జరుగుతాయి. ఆత్మహత్య చేసుకున్నారని.. హత్య జరిగిందని.. మృతదేహం కనిపించిందని పోలీసులకు కాల్స్ వస్తూనే ఉంటాయి. ఐతే కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉంటాయి. కుళ్లిపోయిన శవాలు.. తల లేని మొండేలు.. ఇలా ఎన్నో సంఘటనలను పోలీసులు చూస్తారు. తాజాగా ఒడిశాలో ఇలాంటి కేసు ఒకటి పోలీసులకు సవాల్‌గా మారింది. తల లేని ఓ మహిళ మొండెంను ఇటీవల పోలీసులు గుర్తించారు. ఐతే ఆమె ఎవరు? ఎలా చనిపోయింది? అనే వివరాలు తెలియరాలేదు. అసలు ముందు ఆమె ఎవరో తెలిస్తేనే.. ఎలా చనిపోయిందన్న దానిపై దర్యాప్తు చేయొచ్చు. అందుకే ఆ మహిళ ఎవరని తెలుసుకునేందుకు పోలీసులు క్యాష్ ప్రైజ్ ప్రకటించారు.
ఫిబ్రవరి 4న కటక్ జిల్లాలోని చందక ప్రాంతంలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు చూశారు. శవానికి తల లేకపోవడంతో భయపడి పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి పరిశీలించారు. అక్కడ కత్తితో పాటు గ్లవ్స్, దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఐతే ఆమె ఎవరన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. దర్యాప్తు ముందుకు సాగాలంటే ముందు ఆమె ఎవరో తెలియాలి. అందుకే తల లేని ఆ మహిళను గుర్తుపట్టిన వారికి రూ.50వేలు క్యాష్ ప్రైజ్ ఇస్తామని భువనేశ్వర్- కటక్ పోలీస్ కమిషనరేట్ ప్రకటన విడుదల చేసింది. ఓ ఫొటోను విడుదల చేసి కొన్ని వివరాలను కూడా వెల్లడించారు.
చనిపోయిన మహిళ వయసు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుంది. ఎడమ చేతిపై త్రిశూలం టాటూ ఉంది. ఆ వివరాల ఆధారంగా ఆమె ఎవరో గుర్తు పడితే 8280338323, 8280338296 నెంబర్లకు కాల్ చేయాలని పోలీసులు సూచించారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు, ఇతర వివరాలను ఎక్కడా చెప్పమని, రహస్యంగా ఉంచుతామని చెప్పారు. అంతేకాదు రూ.50వేలు నగదును ఇస్తామని వెల్లడించారు. కాగా, మృతదేహానికి రెండు సార్లు పోస్టుమార్టం చేశారు. హంతకులు మొదట ఆమె గొంతుకోసి చంపేశారని.. ఆ తర్వాత మొండెం, తలను వేరు చేశారని వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఆమె గురించి తెలిస్తే.. కేసును తొందరగానే చేధిస్తామని పోలీసులు చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Odisha