Dowry Harassment: దేశంలో ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ.. మహిళలపై ఏదో ఒకరకమైన వేదింపులు తప్పడం లేదు. ఏడు అడుగులు వేసి.. మూడు ముళ్లు వేసి.. వేద మంత్రాల సాక్షిగా జీవితాంతం పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని ప్రమాణాలు చేసిన భర్తల నుంచి వేధింపులు ఎదురైతే వారి బాధలు ఎవరికి చెప్పుకోవాలి.. పెళ్లైనంత వరకే మహిళ బాధ్యత తల్లిదండ్రులది.. తరువాత అమ్మ, నాన్న అన్నీ తానై చూసుకోవాలసిన బాధ్యత భర్తదే.. కానీ కొందరు భర్తలు మాత్రం కట్టుకున్న నాటి నుంచే భార్యలకు నరకయాతన అనుభవించేలా చేస్తున్నారు. కట్నం తీసుకోవడం నేరమని చెబుతున్నా.. కఠిన శిక్షలు వేస్తున్నా..వరకట్న వేధింపుల సంఘటనలు ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్ పరిధిలోని మియాపూర్‌లో వరకట్న వేధింపులకు ఓ వివాహిత బలైంది. భర్త, అత్తమామలు, ఆడపడుచుల నుంచి నిత్యం వరకట్న వేధింపులు ఎక్కువ అయ్యాయి.. ప్రతి రోజూ ఇదే విషయంపై ఇంట్లో గొడవ జరుగుతుండేది. పెళ్లై ఏడాది కూడా కాలేదు. కానీ భర్త మాత్రం తనకు ఓ విల్లా కొని ఇవ్వాలంటూ తన పుట్టింటి వారిని అడగాలని రోజూ గొడవపడేవాడు..
మియాపూర్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌కు చెందిన మల్లారెడ్డి కుమార్తె పావనికి.. మియాపూర్ నివాసి శ్రావణ్ కుమార్ రెడ్డితో గతేడాది వివాహం జరిగింది. అప్పటినుంచి శ్రావణ్ కుమార్ పావని దంపతులు మియాపూర్‌లో నివాసం ఉంటున్నారు. గత కొన్ని రోజుల నుంచి తెల్లాపూర్‌లో విల్లా కావాలని.. తన తల్లిదండ్రులకు చెప్పాలంటూ శ్రావణ్ కుమార్ పావనిపై ఒత్తిడి తీసుకువస్తున్నాడు. దీంతో అప్పటినుంచి భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి.
తల్లిదండ్రుల నుంచి విల్లా కొనేందుకు హామీ వచ్చినంత వరకు తన కుటుంబ సభ్యులు ఎవరితో మాట్లాడడానికి వీళ్లేదంటూ శ్రావణ్ కుమార్ పావనితో గొడవపడ్డాడు. ఆ తరువాత ఇంటినుంచి బయటకు వెళ్లిపోయాడు. ప్రతి రోజు ఇదే అంశంపై వేధిస్తుండడం.. అత్త, ఆడపడుచుతో పాటు భర్త కూడా రోజూ వేధిస్తుండడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది పావని..
ఇంట్లో ఎవరూ లేని సమయంలో పావని ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. తరువాత స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పావని కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. శ్రావణ్ కుమార్ రెడ్డి వేధింపుల వల్లే తన కుమార్తె మరణించిందని పావని తండ్రి మల్లారెడ్డి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు మియాపూర్ పోలీసులు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.