చాలా ఇబ్బంది పెట్టాడు.. హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీపై మహిళ ఫిర్యాదు..

హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీపై ఓ మహిళ సీపీ అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేశారు. డీసీపీ కలమేశ్వర్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని, రెండున్నర గంటల పాటు ఎండలో నిల్చోబెట్టారని ఎస్‌బ్యాంక్‌ బేగంపేట శాఖ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్యామలకుమారి ఘంటసాల(41) సీపీకి కంప్లైంట్ చేశారు.

news18-telugu
Updated: February 26, 2020, 9:12 AM IST
చాలా ఇబ్బంది పెట్టాడు.. హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీపై మహిళ ఫిర్యాదు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీపై ఓ మహిళ సీపీ అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేశారు. డీసీపీ కలమేశ్వర్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని, రెండున్నర గంటల పాటు ఎండలో నిల్చోబెట్టారని ఎస్‌బ్యాంక్‌ బేగంపేట శాఖ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్యామలకుమారి ఘంటసాల(41) సీపీకి కంప్లైంట్ చేశారు. ‘ఓ బ్యాంకు వైస్‌ ప్రెసిడెంట్‌ హోదాలో తనకు పోలీసుల నుంచి అవమానం జరిగింది. దిశ చట్టం, డయల్‌ 100 ఎందుకు? సమస్యలు వచ్చినప్పుడు పోలీసుల సాయం కోరతాం. పోలీసుల వల్లే సమస్య వచ్చినప్పుడు ఎవరిని పిలవాలి సర్‌. ఈ కంప్లైంట్ లెటర్ రాస్తున్న టైంలో కన్నీరు వస్తోంది’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ట్రంప్‌ భారత పర్యటనకు నిరసనగా సీపీఐ నేత నారాయణ, ఆ పార్టీ కార్యకర్తలు బేగంపేటలోని యూఎస్‌ కాన్సులేట్‌‌కు వచ్చారు. ఆ సమయంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, తనిఖీ చేసి అనుమతించారు.

యూఎస్‌ కాన్సులేట్‌కు ఎదురుగా ఉన్న ఎస్‌ బ్యాంక్‌ బ్రాంచిలో వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న శ్యామల కుమారి మధ్యాహ్నం 1.45 గంటల ప్రాంతంలో బ్యాంక్‌ లోపలికి వెళ్తుండగా కారును పోలీసులు అడ్డుకున్నారు. ఐడీ కార్డు చూపించి లోపలికి వెళ్లేప్పుడు డీసీపీ కలమేశ్వర్‌ అక్కడికి వచ్చి కారును ఆపి, కేకలు వేస్తూ తనను కారు నుంచి దించడమే కాకుండా పది నిమిషాలు అక్కడే వెయిట్‌ చేయాలన్నారని ఆమె ఫిర్యాదులో ఆరోపించారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉన్నాయని, తాను తప్పు చేయకపోయినా డీసీపీ శిక్షించారని పేర్కొన్నారు.

డీసీపీ సహా మహిళా అధికారి కూడా అక్కడికి రాలేదని, తనను బ్యాంక్‌ లోపలికి వెళ్లనీయకుండా రెండున్నర గంటల పాటు ఎండలో నిలబెట్టారని ఆమె ఆరోపించారు. కాగా, ఫిర్యాదుపై సీపీ అంజనీ కుమార్ స్పందించారు. ఫిర్యాదు అందిన విషయం వాస్తవమేనని, విచారణ అధికారిని నియమించి కారణాలు ఆరా తీస్తున్నామని అన్నారు. ఫిర్యాదుదారుతో తానే స్వయంగా మాట్లాడతానని, కేసును తానే స్వయంగా విచారించనున్నట్లు సీపీ ఆమెకు హామీ ఇచ్చారు.

First published: February 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు