ఈజీగా మనీ వస్తుందంటే చాలు మనలో చాలా మంది కనెక్ట్ అవుతారు. ఇది మనుషుల సహజ లక్షణం. సరిగ్గా ఈ పాయింట్‌నే బేస్ చేసుకుంటారు నేరగాళ్లు. చిట్టీల మోసాలన్నీ ఇలాంటివే కదా. ఐతే.. కాలం మారేకొద్దీ మోసాలు చేసే తీరు కూడా మారుతోంది. నేరగాళ్లు సరికొత్త విధానాల్లో చీట్ చేస్తున్నారు. ఇది అలాంటిదే. విషయం ఏంటంటే.. ఓ ఐటీ ఉద్యోగి.. యూట్యూబ్‌లో వీడియోలకు లైక్స్ కొట్టి.. రూ.18.9 లక్షలు పోగొట్టుకున్నాడు. దీనికి సంబంధించి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వివరాలు తెలిపారు.
పోలీసుల ప్రకారం.. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ (KPHB) చెందిన బాధితుడు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. తన మానాన తాను ఉద్యోగం చేసుకుంటూ హాయిగా జీవిస్తున్నాడు. అతనికి జనవరిలో వాట్సాప్‌లో ఒక మెసేజ్ వచ్చింది. జనరల్‌గా అతను అలాంటివి చదవడు. కానీ అతని దురదృష్టం కొద్దీ ఆ రోజు ఆ మెసేజ్ చదివాడు.
"యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసే ఒక్కో వీడియోకీ లైక్ కొడితే రూ.50 చొప్పున కమీషన్ ఇస్తాము" అని ఆ మెసేజ్‌లో ఉంది. మొదట నమ్మలేదు. తర్వాత నిజమేనేమో అని అనుకున్నాడు. లైకే కదా.. కొడితే ఏమవుతుంది? అని అనిపించింది. నిజంగానే మనీ వస్తే.. రోజుకు పది లైకులు కొడితే... రూ.500 వస్తాయి. అంటే నెలకు రూ.15,000. వావ్.. ఇదేదో బాగుంది.. ట్రై చేద్దాం అనుకున్నాడు.
ముందుగా నేరగాళ్లు... 3 వీడియోల లింకులు పంపారు. అవి యూట్యూబ్ లింకులా కాదా అని గమనించి మరీ వాటిని క్లిక్ చేశాడు. ఆ లింకుల్లో ఎలాంటి తేడా లేదు. అవి వీడియోల లింకులే. కాబట్టి.. ఇది చీటింగ్ కాదులే అనుకున్నాడు. వాటికి లైక్స్ కొట్టాడు. స్క్రీన్ షాట్లను పంపాడు. తన బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇచ్చాడు. వెంటనే అతనికి రూ.150 వచ్చాయి. అరే భలే ఉందే అనుకున్నాడు. గబగబా మరో 10 వీడియోలకు లైక్స్ కొట్టేశాడు. స్క్రీన్ షాట్లను పంపాడు. కానీ మనీ రాలేదు.
మనీ ఎందుకు వెయ్యలేదని అడిగాడు. ఎవరు బడితే వారు లైక్ కొడితే మనీ ఇవ్వము అన్న నేరగాళ్లు... తన దగ్గర పేరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనీ.. అందుకు రూ.600 అవుతుంది అన్నారు. అలాగే... ప్రిపెయిడ్‌గా మరో రూ.3000 పంపితే... మొత్తంగా రూ.4,750 రిటర్న్ ఇస్తామని చెప్పారు. (ఇదే అసలు మోసం). అతను ఈ మోసాన్ని గుర్తించలేదు. గబగబా మనీ పే చేశాడు. వెంటనే అతని అకౌంట్ లోకి రూ.4,750 వచ్చాయి. ఎగిరి గంతేశాడు. ఉద్యోగం మానేసి.. ఇదే చేస్తే బెటర్ అనుకున్నాడు.
బాధితుడు తమ లైన్ లోకి వచ్చాడనుకున్న నేరస్థులు... మరో మెసేజ్ పంపారు. ప్రీపెయిడ్‌గా రూ.1.80 లక్షలు పంపితే... రూ.3.24 లక్షలు రిటర్న్ ఇస్తామని చెప్పారు. ఆశ్చర్యపోయాడు. ట్రై చేస్తే పోలా అనుకున్నాడు. వాళ్లు కోరినట్లే.. రూ.1.80 లక్షలు పే చేశాడు. కాసేపటికే అతనికి రూ.3.24 లక్షలు వచ్చాయి. ఈసారి ఏకంగా గాల్లో తేలాడు. ఇక ఈ భూమిపై తన అంత అదృష్టవంతుడు లేడు అనుకున్నాడు.
ఇక్కడి వరకూ నేరగాళ్లు లాస్ లోనే ఉన్నారు. కానీ వాళ్లు కచ్చితంగా మోసం చేయగలం అనే కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. ఈసారి మరో మెసేజ్ పంపారు. ఈ లైకులతో కంటే.. ఒకేసారి భారీగా సంపాదించేలా రూ.18.90 లక్షలు ప్రీపెయిడ్ కడితే.. ఏకంగా రూ.27 లక్షలు ఇస్తామని చెప్పారు. కనీసం ఇప్పుడైనా అతను అలర్ట్ అవ్వాల్సింది. కానీ వాళ్లను బాగా నమ్మేశాడు. చీటింగ్ అనే ఊబిలో ఉన్న విషయం గుర్తించలేదు. వాళ్లు కోరినట్లు చెల్లించాడు.
అతనికి రూ.27 లక్షలు జమ చేసినట్లు చూపించారు. కానీ ఆ డబ్బు విత్ డ్రా కాలేదు. ఎందుకిలా అని అడిగితే... సెటిల్‌మెంట్ ఫీజు కింద రూ.15 లక్షలు కడితే.. ఆ 27 లక్షలూ, ఈ 15 లక్షలూ.. మొత్తం ఇచ్చేస్తామని చెప్పారు. అప్పుడు బాధితుడికి మ్యాటర్ అర్థమైంది. తాను అడ్డంగా మోసపోయానని గ్రహించాడు. ఏం చెయ్యాలో అర్థం కాక పోలీసుల్ని ఆశ్రయించాడు.
ఈ మొత్తం స్టోరీలో యూట్యూబ్ తప్పేమీ లేదు. కానీ నేరగాళ్లు... దీని ద్వారా ఎలా చీట్ చెయ్యాలో ఆలోచించి.. ముంచారు. ఇలా ఉంటున్నాయి ఈ రోజుల్లో మోసాలు. వీటి బారిన పడకుండా ఉండాలంటే.. మనం డబ్బు చెల్లించకుండా ఉండాలి. పొరపాటున చెల్లిస్తే.. మోసపోయినట్లే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CYBER CRIME, Hyderabad, Telangana, Youtube