పనిచేయడం చేత కాదు. కష్ట పడడం అస్సలు తెలియదు. అందుకు ఈజీమనీ కోసం అడ్డు దారులు తొక్కుతున్నాడు ఈ కుర్రోడు. వాహనాలను చోరీచేసి వాటి విడి విభాగాలను అమ్ముకుంటూ డబ్బు సంపాదిస్తున్నాడు. కొంతకాలంగా మనోడికి ఉన్న పని ఇదొక్కటే. ఐతే ఇటీవల ఓ లారీ చోరీ కావడంతో ఆ కేసును లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు ఈ దొంగ పట్టబడ్డాడు. రాచకొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 13న వనస్థలిపురం ఆటోనగర్‌లో నిలిపిఉన్న తన లారీని ఎవరో ఎత్తుకెళ్లారని శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఐతే ఐదు రోజులైనా ఎలాంటి వివరాలు తెలియలేదు. కానీ బుధవారం ఎట్టకేలకు లారీ దొంగ పోలీసులకు చిక్కాడు.
ఎలా దొరికాడంటే...:
ఆటోనగర్ ప్రాంతంలో బుధవారం ఉదయం ఓ యువకుడు లారీ టైర్లతో అనుమానాస్పదంగా కనిపించాడు. పలు దుకాణాలతకు తిరుగుతూ వాటిని అమ్మేందుకు ప్రయత్నించాడు. అప్పటికే నిఘాపెట్టిన పోలీసులు.. అతడిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పాడు. తమదై స్టైల్లో నాలుగు దెబ్బలు వేస్తే లారీ చోరీ విషయాన్ని బయటపెట్టాడు. ఆటో నగర్ నుంచి లారీని తీసుకెళ్లి నకిరేకల్ పట్టణ శివారులో పార్క్ చేశానని.. ఆ తర్వాత లారీ టైర్లు ఊడదీసి తీసుకెళ్లినట్లు నేరాన్ని ఒప్పుకున్నాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన కోర్టులో ప్రవేశపెట్టారు.
లారీ చోరీ చేసిన ఆ యువకుడి పేరు కొత్తపల్లి సాయిబాబా. వయసు 22. వృత్తి లారీ డ్రైవర్. నల్లగొండ జిల్లా శాలిగౌరార మండం తుడిముడి స్వస్థలం. హైదరాబాద్ నల్లకుంటలో అద్దె ఇంట్లో ఉంటూ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. విచారణలో నిందితుడు చెప్పిన వివరాల ఆధారంగా నార్కట్‌పల్లికి వెళ్లిన పోలీసులు.. అక్కడ లారీని స్వాధీనం చేసుకున్నారు. రూ.10 లక్షల విలువైన ఆ లారీని ఓనర్ శ్రీనివాస్‌కు అప్పగించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Hyderabad, Telangana, Telangana Police