టాలీవుడ్ నటీనటులు, తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులకు నిత్యం ఖరీతైన పార్టీలు ఇస్తూ, హైదరాబాద్ పేజ్-3 పార్టీల సెలబ్రిటీగా ఒక వెలుగు వెలిగిన శిల్పా చౌదరి ఉదంతంలో అనేక చీకటి కోణాలు బయటికొస్తున్నాయి. పెట్టుబడికి డబ్బులిస్తే అధిక వడ్డీ ఇస్తానంటూ ఏకంగా వందల కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన శిల్పా చౌదరి, ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ లను తాజాగా విచారించిన పోలీసులు కొత్త విషయాలెన్నో రాబట్టారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరి ప్రియదర్శిని సహా వందల మందిని మోసం చేసిన ఈ జంట పోలీస్ కస్టడీలో కొత్త ప్రపోజల్స్ తీసుకొచ్చినట్లు తెలిసింది. బాధితులకు డబ్బులు తిరిగిస్తామని శిల్పా చౌదరి చెప్పినట్లు వెల్లడైంది. అయితే ఆ ఇద్దరి బ్యాంక్ అకౌంట్లను పరిశీలించిన పోలీసులకు షాక్ తగిలినంతపనైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన శిల్పా చౌదరి కేసులో తాజా అప్ డేట్స్ ఇవి..
పెట్టుబడి ముసుగులో పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన శిల్పా చౌదరి కేసులో పోలీస్ కస్టడీ ముగిసింది. మూడు రోజుల కస్టడీ ముగియడంతో శిల్పా చౌదరి, ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ లను సోమవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. విచారణ సందర్భంగా శిల్పా చౌదరి నుంచి పోలీసులు కీలక వివరాలు రాబట్టారు. కోట్లాది రూపాయాల మోసానికి పాల్పడగా, ప్రస్తుతం శిల్ప బ్యాంక్ ఖాతాలో రూ.16 వేలు, భర్త శ్రీనివాస్ ప్రసాద్ అకౌంట్ లో రూ.14వేలు మాత్రమే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కొల్లగొట్టిన సొమ్మును ఎటు తరలించారనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. కాగా,
శిల్పా చౌదరిపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు రాగా, వాటిలో మహేశ్ బాబు సోదరి సహా మూడు కేసుల్లో రూ.7కోట్లకు సంబంధించి డబ్బులు తిరిగిచ్చేస్తానని ఆమె పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దివ్యారెడ్డి, ప్రియదర్శిని(మహేశ్ బాబు చెల్లెలు), రేణుకా రెడ్డిల నుంచి రూ.7 కోట్లకుపైగా తీసుకుని ఎగ్గొట్టినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. శిల్ప అమెరికాలో మూడేళ్లపాటు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేసినట్లు దర్యాప్తులో తేలింది. అమెరికా నుంచి భారత్ వచ్చి మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. రాధికారెడ్డికి రూ.10 కోట్లకు పైగా ఇచ్చినట్లు పోలీసులతో వాదించిన శిల్పా.. అందుకు తగిన ఆధారాలు మాత్రం ఇవ్వలేదు. దీంతో..
శిల్పా మోసాలపై మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు నార్సింగి పోలీసులు. ఆ క్రమంలోనే మరోసారి రిమాండ్ కోరే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు చేసిన దర్యాప్తు ప్రకారం శిల్పాచౌదరి 32కోట్ల వరకు మోసం చేసినట్లు గుర్తించారు. తనను తాను సెలబ్రిటీగా, సోషలైట్ గా ప్రచారం చేసుకునే శిల్పా చౌదరి.. పేజ్ త్రీ పార్టీలు, కిట్టీ పార్టీలతో సంపన్నులే టార్గెట్‌గా తన కుట్రల్ని అమలు చేసిందని పోలీసులు చెబుతున్నారు. ఒకప్పుడు సినీ తారలా వెలిగిపోయిన శిల్పా చౌదరి గత నెల 27న అరెస్టు కాగా, రెండు వారాల కస్టడీ తర్వాత గుర్తుపట్టలేనంతగా మారిపోయారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Hyderabad, Hyderabad police