ఈమె పేరు శిల్పా చౌదరి. సెలబ్రిటీల కార్యకలాపాలకు సంబంధించిన పేజ్-3 వార్తలు ఫాలో అయ్యేవారికి కొద్దో గొప్పో ఈమె పరిచితురాలే. ఇక టాలీవుడ్ హీరోలు, తెలుగు రాష్ట్రాల ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, బడా పారిశ్రమికవేత్తలు, లాయర్లల్లో కొందరికి ఈమె బాగా క్లోజ్. హైదరాబాద్ (Hyderabad) సిటీలో, శివారు ప్రాంతాల్లో తరచూ పేజ్-3 పార్టీలు ఇస్తూ గొప్ప దర్పాన్ని ప్రదర్శిస్తారామె. తనను తాను సోషలైట్ గా చెప్పుకునే శిల్పా చౌదరి ఇప్పుడు కటకటాలపాలయ్యారు. ఒకటీ రెండూ కాదు, ఏకంగా వందల కోట్ల రూపాయల మోసానినికి పాల్పడిన ఆమెను నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అధిక వడ్డీ ఇస్తానని ఆశచూపి బడా బాబుల దగ్గరే డబ్బులు లాగేసిందీ కిలేడి. ఈమె వలలో చిక్కినవారిలో టాలీవుడ్ (tollywood) యువ హీరోలు, ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. శిల్పా వడ్డీ వ్యాపారాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో పోలీసులు యాక్షన్ లోకి దిగారు. అరెస్టు తర్వాత ఆమె చేతిలో మోసపోయిన బాధితులు వెల్లువలా పోలీస్ స్టేషన్ కు వస్తున్నారు. శిల్పా చౌదరి ఉదంతంపై పోలీసులు చెప్పిన వివరాలివి..
చోటామోటా వ్యాపారలు చేస్తూ, హైదరాబాద్ లో ప్రముఖ సోషలైట్ గా వెలుగొందుతూ, టాలీవుడ్ నటులు, ఉన్నతాధికారులకు పేజ్-3 పార్టీలు ఇస్తూ, నిత్యం వార్తల్లో నిలిచే శిల్పా చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఫైనాన్సియర్ దగ్గర్నుంచి డబ్బులు తీసుకొని శిల్ప మోసం చేసిందంటూ ఫిర్యాదులు అందడంతో పోలీసులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. అధిక వడ్డీ ఆశచూపి పలువురు సెలబ్రిటీల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజేసినట్లు శిల్పపై ఆరోపణలున్నాయి.
తక్కువ సమయంలో డబ్బును రెండింతలు, మూడింతలు చేస్తానని, అధిక వడ్డీ ఇస్తానని నమ్మించి శిల్పా చౌదరి ఏకంగా 200 కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టింది. టాలీవుడ్ సెలబ్రిటీలు, బడా బాబుల నుంచి డబ్బులు గుంజడమే లక్ష్యంగా శిల్ప తరచూ పేజ్-3 పార్టీలు నిర్వహిస్తుంది. తన పార్టీకి వచ్చే ప్రముఖులకు ఫైనాన్స్ ప్లాన్లు వివరించి, అధిక వడ్డీ ఇస్తానని నమ్మించేది. స్వతహాగా పారిశ్రామికవేత్త కావడం, సోషలైట్ గా ముద్రపడి ఉండటంతో ఆమెను నమ్మేసి కొందరు కోట్ల రూపాయాలు సమర్పించుకున్నారు. తీరా అధిక వడ్డీ కాదు కదా, అసలు కూడా తిరిగిరాని పరిస్థితిలో తాము మోసపోయినట్లు గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు..
అధిక వడ్డీల ఆశ చూపి శిల్పా చౌదరి ఇప్పటికే రూ.200 కోట్ల మోసానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. శిల్ప వలలో చిక్కినవారిలో సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, లాయర్లు ఫైనాన్షియర్లు ఉన్నారు. ముగ్గురు యువ హీరోలు సైతం శిల్ప బాధితుల జాబితాలో ఉన్నట్లు తెలిసింది. అక్రమ వడ్డీ వ్యాపారం పేరుతో భారీ మోసానికి పాల్పడిన ఉదంతంలో శిల్పా చౌదరితోపాటు ఆమె భర్తనూ హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Arrested, Celebrities, Cheating case, Hyderabad, Hyderabad police