విశ్వనగరం హైదరాబాద్ ప్రతిష్టను దిగజార్చుతూ, నగరంలో ఆడపిల్లల భద్రతపై సవాళ్లను పెంచుతూ, రాజకీయంగానూ కలకలానికి దారితీసిన ‘మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం’ ఉదంతంలో షాకింగ్ విషయాలు బయటికొస్తున్నాయి. మే 28న దారుణం జరగ్గా, మూడు రోజుల తర్వాతగానీ ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడంతో బడాబాబుల కొడుకులను పోలీసులు కాపాడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి..
సిటీలో టాప్ మోస్ట్ ఇంటర్నేషనల్ స్కూలుకు చెందిన విద్యార్థులు జూబ్లీహిల్స్ లోని ఆమ్నీషియా పబ్బులో పార్టీ చేసుకున్నక్రమంలో రుమేనియాకు చెందిన మైనర్ బాలికను ఇంట్లో దిగబెడతామంటూ తీసుకెళ్లిన బడాబాబుల కొడుకులు.. రెండు సార్లు కార్లు మార్చి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇప్పటి దాకా మొత్తం ఆరుగురు నిందితులను గుర్తించిన పోలీసులు.. మరో నలుగురికి క్లీన్ చీట్ ఇచ్చారు. ఇప్పటికీ షాక్ లోనే ఉన్న బాలిక ప్రస్తుతం చికిత్స పొందుతున్నది. తాజాగా వెల్లడైన వివరాలను బట్టి.. తెలంగాణ ప్రభుత్వం గుర్తింపు పొందిన అధికార వాహనంలోనే అత్యాచారం జరిగినట్లు వెల్లడైంది..
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఉదంతంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ అధికారికంగా వినియోగించే (ప్రభుత్వంచే గుర్తించిన) ఇన్నోవా కారులోనే బాలికపై అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది. తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబరుతో ఉన్న వాహనానికి ‘ప్రభుత్వ వాహనం’ అనే స్టిక్కర్ కూడా ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీల ద్వారా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ కారు ఓ ప్రజాప్రతినిధి భార్య పేరిట ఉందనే వాదన వినిపిస్తోంది. పోలీసులు ఇన్నోవాను స్వాధీనం చేసుకున్నప్పుడు మాత్రం ప్రభుత్వ వాహనం అనే స్టిక్కర్ మాయమైనట్లు సమాచారం. దీనిపై పోలీసులు వివరణ ఇవ్వాల్సి ఉంది.
హైదారాబాద్ ఓల్డ్ సిటీలోని పుప్పాలగూడకు చెందిన సాదుద్దీన్ మాలిక్ (18), ఓల్డ్ సిటీ ఎమ్మెల్యే సోదరుడి కొడుకు అమేర్ ఖాన్ (18), ప్రభఉత్వ సంస్థ చైర్మన్ కొడుకు (16), సంగారెడ్డి జిల్లాకు చెందిన అధికార పార్టీ నేత కొడుకు (16), జీహెచ్ఎంసీ కార్పొరేటర్ కొడుకు (16), ఓల్డ్ సిటీ ఎమ్మెల్యే కొడుకు (17) ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీళ్లలో ముగ్గురిని శనివారం రాత్రి వరకు అరెస్టు చేశారు.
శుక్రవారం రాత్రి అరెస్టయిన సాదుద్దీన్ ను చంచల్ గూడ జైలుకు తరలించగా, వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు, కార్పొరేటర్ కొడుకును (వారు 18ఏళ్ల లోపువారు కావడంతో) జువెనైల్ హోమ్ కు తరలించారు. వీళ్లలో వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు నెల్లూరు పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. ఎమ్మెల్యే సోదరుడి కొడుకును ఇప్పటికే రహస్యంగా దుబాయ్ తరలించారని తెలుస్తోంది. ఎమ్మెల్యే కొడుకు విషయంలోనూ సందిగ్ధత కొనసాగుతోంది. అయితే వాడికి తొలుత క్లీన్ చీట్ ఇచ్చిన పోలీసులు.. తర్వాత ఏ6గా చేర్చినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే కొడుకు ప్రమేయానికి సంబంధించి.. తొలుత.. సీసీ ఫుటేజీ పరిశీలన ద్వారా అతడికి సంబంధం లేదని పోలీసులు తెలిపారు. బాలికతో అతడు కూడా పబ్ నుంచి బేకరీకి వెళ్లాడు. తిరిగివచ్చేటప్పుడు మాత్రం ఇన్నోవా వాహనం ఎక్కలేదు. దీంతో అతడి పాత్ర నిర్ధారణ కాలేదని పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్ ప్రకటించారు. ఇదిలా ఉండగా బాలికతో కలిసి ఎమ్మెల్యే కుమారుడు బెంజ్ కారులో ప్రయాణిస్తున్న చిత్రాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. వీటిని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు మీడియాకు విడుదల చేశారు. దీంతో సీన్ రివర్స్ అయింది.
ఎమ్మెల్యే కుమారుడు స్పష్టంగా కనిపిస్తున్నా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రభుత్వం, పోలీసులపై ప్రశ్నలు వెల్లువెత్తాయి. దీంతో పోలీసులు.. ఎమ్మెల్యే కుమారుడి పేరును ఎ-6 గా ఎఫ్ఐఆర్లో చేర్చే ప్రయత్నాలు ఆరంభించారు. ఈ నేపథ్యంలో బాధితురాలి వద్ద పోలీసులు మరోసారి వాగ్మూలం తీసుకోనున్నారు. ఈ ప్రక్రియ అనంతరం ఎమ్మెల్యే కుమారుడి పేరును ఎఫ్ఐఆర్లో చేర్చుతారు. బాధితురాలి వాగ్మూలాన్ని సెక్షన్ 164 కింద జడ్జి ఎదుట రికార్డు చేయడానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gang rape, Hyderabad, Hyderabad police, Minor rape