మానసిక వికలాంగురాలిని అత్యాచారం చేసిన హోంగార్డుకు హైదరాబాద్ న్యాయస్థానం కఠిన కారాగార శిక్ష విధించింది. ఎస్టీ కమ్యూనిటీకి చెందిన పదహారేళ్ల బాలికపై హోంగార్డు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో హోంగార్డ్ ని దోషిగా తేల్చిన నాంపల్లి కోర్ట్ 30 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అలాగే, ఈ హేయమైన చర్యకు పాల్పడిన సదరు దోషిని రూ.7 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అంతే కాకుండా 50 వేల రూపాయలు జరిమానా విధించింది. హైదరాబాద్లోని నాంపల్లిలో మొదటి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి.. ఈ కేసుకు సంబంధించి తీర్పును వెలువరించారు.
మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ వ్యక్తి పేరు మల్లికార్జున. అతడు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో హోం గార్డ్ గా పని చేసేవాడు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో బాధిత బాలికతో పరిచయం పెంచుకున్నాడు. సికింద్రాబాద్ లోని అడ్డగుట్ట ఏరియాలో బాధితురాలు తన తల్లితో పాటు నివసించేది. వీరు మల్లికార్జున ఇంటి సమీపంలోనే అద్దెకు ఉండేవారు. ఈ క్రమంలోనే మైనర్ బాలికపై నిందితుడు కన్నేశాడు. ఒకరోజు ఒంటరిగా ఉన్న బాలికను శారీరకంగా లోబరుచుకున్నాడు. తరువాత 15 రోజుల పాటు బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. మల్లికార్జున తన కూతురి జీవితాన్ని చిదిమేస్తున్నాడనే విషయాన్ని తల్లి తెలుసుకోలేక పోయింది. కొద్ది రోజుల తర్వాత ఆమె తన కుమార్తెను తీసుకొని సిద్దిపేటకు వెళ్ళి పోయింది.
అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఐదు నెలల గర్భవతి అని తేలింది. దీంతో తల్లి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయింది. తర్వాత తేరుకొని బాలికను ఆరా తీసింది. దీంతో బాధిత బాలిక తన తల్లికి హోంగార్డు గురించి చెప్పింది. వెంటనే తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే బాధిత బాలిక మానసిక వైకల్యంతో బాధ పడుతుందని వైద్యులు గుర్తించారు. అనంతరం వారి సలహా మేరకు బాలికకు అబార్షన్ చేయించింది తల్లి. అయితే క్షమించరాని నేరం చేసిన హోం గార్డ్ కి న్యాయస్థానం సరైన శిక్ష విధించిందని తుకారాంగేట్ పోలీస్ అధికారులు చెప్పుకొచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Hyderabad, RAPE, Telangana