హోమ్ /వార్తలు /క్రైమ్ /

Andhra pradesh: ఒక మిఠాయి కొట్టు.. ఆరు బోగస్ కంపెనీలు.. రూ.50 కోట్లకు టోకరా..

Andhra pradesh: ఒక మిఠాయి కొట్టు.. ఆరు బోగస్ కంపెనీలు.. రూ.50 కోట్లకు టోకరా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Andhra Pradesh: వ్యాపారంలో బాగానే సంపాదించిన రాంబాబు.. హైదరాబాద్ లోని ఓ చానల్లో యాంకర్ గా పనిచేస్తున్న యువతిని పెళ్లి చేసుకున్నాడు.

ఓ మిఠాయి కొట్టు వ్యాపారి.. ఆరు బోగస్ కంపెనీలు సృష్టించాడు. నకిలీ ఇన్వాయిస్ తో ప్రభుత్వానికి ఏకంగా రూ.50 కోట్లకు టోకరా వేశాడు. మనోడు చూపించిన అతి తెలివిని అధికారులు ఇట్టే పట్టేశారు. పక్కా స్కెచ్ వేసి అన్ని ఆధారాలతో అతడ్ని లోపలేశారు. వివరాల్లోకి వెళ్తే.., కృష్ణాజిల్లా, వీరులపాటు మండలం, జుజ్జూరుకు చెందిన పూల రాంబాబు.. గతంలో స్థానికంగా మిఠాయి కొట్టు నడిపేవాడు. వ్యాపారం సరిగా సాగకపోవడంతో దానిని మూసేసి ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లిపోయాడు. అక్కడ ఓ పెట్రోల్ బంక్ పనికి చేరాడు. కొన్నాళ్ల ఆ ఉద్యోగానికి కూడా గుడ్ బై చెప్పి పాత ఇనుప సామాన్ల వ్యాపారం మొదలెట్టాడు. మనోడికి అది కూడా వర్కవుట్ కాకపోవడంతో కాస్మొటిక్స్ వ్యాపారం ప్రారంభించారు.

బెంగళూరు నుంచి కాస్మొటిక్స్ తీసుకొచ్చి బ్యూటీ పార్లర్లకు సరఫరా చేశాడు. వ్యాపారంలో బాగానే సంపాదించిన రాంబాబు.. హైదరాబాద్ లోని ఓ చానల్లో యాంకర్ గా పనిచేస్తున్న కృష్ణాజిల్లా నందిగామకే చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన తర్వాత మనోడి బుద్ధి పక్కదారి పట్టింది. ఓవర్ నైట్ కోటీశ్వరుడు కావాలని కలలుగన్నాడు. అనుకున్నదే తడవుగా బోగస్ కంపెనీలు సృష్టించాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు సూట్ కేస్ కంపెనీలు క్రియేట్ చేశాడు.

మారుతి ఎంటర్ ప్రైజెస్, శ్రీ ఎంటర్ ప్రైజెస్, లాస్య ఎంటర్ ప్రైజెస్, గోపాల్ ట్రేడర్స్ ఇంపెక్స్, లాస్య ఎంటర్ ప్రైజెస్, గోపాల్ ట్రేడ్ ఇంపెక్స్ పేరుతో బోగస్ కంపెనీలను క్రియేట్ చేసి ఆ కంపెనీల ద్వారా వ్యాపార లావాదేవీలు నడిపినట్లు నకిలీ ఇన్ వాయిస్ లు సృష్టించాడు. వాటిని ప్రభుత్వానికి సమర్పించి రూ.50 కోట్ల వరకు ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందాడు. ఇదే క్రమంలో సొంత గ్రామమైన జుజ్జూరులో డాబు దర్పం ప్రదర్శించాడు. వైసీపీలో చేరి స్థానిక నేతగా చలామణీ అయ్యాడు. వెంట జనాల్ని వేసుకొని తిరగడం, ఎన్నికల్లో ప్రచారాలు, పార్టీలు అసలు రాంబాబు హిస్టరీ తెలిసిన వాళ్లు ప్రస్తుతం అతడి వైభోగం చూసి నోరెళ్లబెట్టారు.

మరోవైపు రాంబాబు ఆర్ధిక కార్యకలాపాలపై అనుమానం వచ్చిన జీఎస్టీ అధికారులు అతడిపై నిఘా ఉంచారు. వారం రోజుల పాటు అతని ఇంటి దగ్గర రెక్కీ చేసి సోదాలు నిర్వహించారు. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత రాంబాబాను అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి రూ.2.31 కోట్లు రికవరీ చేశారు. అనంతరం రాంబాబును కోర్టులో ప్రవేశ పెట్టగా 16 రోజుల రిమాండ్ విధించారు. మరోవైపు స్వగ్రామంలో వైసీపీ నేతగా చలమణి అవుతున్న రాంబాబు.. పంచాయతీ ఎన్నికల్లో పలువురికి ఫైనాన్షియర్ గా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

First published:

Tags: Andhra Pradesh, Andhra pradesh news, AP News, Crime, Crime news, GST, Hyderabad, Hyderabad news, Krishna District, Telugu news

ఉత్తమ కథలు