తీవ్ర నేరానికి పాల్పడిన బడా బాబుల కొడుకులకు పోలీస్ కస్టడీలోనూ రాచమర్యాదలు లభిస్తున్నాయా? హైదరాబాద్ ప్రతిష్టను దిగజార్చిన జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ (Jubilee Hills Gang Rape Case) నిందితులకు స్టార్ హోటల్ నుంచి బిర్యానీ అందుతోందా? అంటే సోషల్ మీడియాలో సంచలనంగా మారిన ఫొటోలను బట్టి అవుననే సమాధానం వినిపిస్తోంది. పోలీసులు మాత్రం బిర్యానీ పెట్టడాన్ని రాచమర్యాదగా చూడొద్దంటున్నారు. టీఆర్ఎస్, దాని మిత్రపక్షమైన ఎంఐఎం ప్రజాప్రతినిధులు, కీలక నేతల కొడుకులే నిందితులుగా ఉన్న హైదరాబాద్ గ్యాంగ్ రేప్ (Hyderabad Gang Rape Case) ఉదంతంపై దర్యాప్తు కొలిక్కి వస్తున్న దశలో బిర్యానీలు అందజేయడం విమర్శలకు తావిచ్చినట్లయింది. వివరాలివే..
రెండేళ్ల కిందటి దిశ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు నిందితులకు చర్లపల్లి జైలులో మొదటి రోజు మటన్ బిర్యానీ పెట్టిన ఉదంతం అప్పట్లో ఆ విషయం దుమారం లేపింది. పోలీసు, జైళ్ల శాఖ అధికారులు విమర్శలపాలయ్యారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులోనూ పోలీసు కస్టడీలో ఉన్న మైనర్ నిందితులకు స్టార్ హోటల్ నుంచి బిర్యానీలు తెప్పించారు. ఈ కేసులో విదేశీ బాలిక బాధితురాలు కాగా.. పోలీసు కస్టడీలో ఉన్న మైనర్ నిందితులంతా వీవీఐపీల పిల్లలే..! దాంతో కేసు దర్యాప్తుపై నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. నిందితులకు ఓ స్టార్ హోటల్ నుంచి బిర్యానీ పార్సిళ్లు రావడం చర్చనీయాంశమైంది.
ఆ రెండు కార్ల మధ్యలోనే నుంచే : సామూహిక అత్యాచారానికి వాడిన ఆ రెండు కార్ల మధ్యలోనే నుంచి సహాయకులు బిర్యానీ ప్యాకెట్లు మోసుకెళుతోన్న దృశ్యాలు సంచలనంగా మారాయి. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో ఆదివారం పోలీసులు తమ కస్టడీలో ఉన్న మైనర్ నిందితులతో సామూహిక అత్యాచార ఘటన క్రమాన్ని సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ ద్వారా రికార్డ్ చేశారు. ఆ తర్వాత నిందితులను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. అప్పటికే ఓ స్టార్ హోటల్ నుంచి వచ్చిన పార్సిళ్లు సిద్ధంగా ఉన్నాయి.‘‘గ్యాంగ్‌రేప్ కేసు నిందితులకు ఠాణాలో రాచ మర్యాదలు.. స్టార్ హోటల్ బిర్యానీ పార్సిళ్లు’’ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోలీసుల తీరుపై దుమ్మెత్తిపోశారు.
పోలీసులు ఏమన్నారంటే: కస్టడీలో ఉన్న గ్యాంగ్ రేప్ నిందితులకు బిర్యానీ పెట్టడంపై తీవ్ర విమర్శలురాగా, దీనిపై ఓ అధికారి స్పందిస్తూ.. ‘‘అవి మా సిబ్బంది కోసం తెప్పించినవి’’ అని వివరణ ఇచ్చారని, మరో అధికారి మాత్రం నిందితుల కోసం తెప్పించినవేనని అంగీకరించారని ‘ఆంధ్రజ్యోతి’ రిపోర్ట్ చేసింది. నిందితులు సాధారణ భోజనం తినడానికి ఇష్టపడడని కారణంగానే బిర్యానీ తెప్పించాల్సి వచ్చిందని, వాళ్లు ఆరోగ్యంగా ఉండటం పోలీసుల బాధ్యతే కాబట్టి చేయాల్సి వచ్చిందని, అలాగని బిర్యానీలు పెట్టడం రాచమర్యాద కాదని సదరు అధికారి వ్యాఖ్యానించారు.
సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ పూర్తి: బిర్యానీ వివాదం ఇలా ఉంటే, జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం కేసును పోలీసులు ఓ కొలిక్కి తెస్తున్నారు. ప్రధాన నిందితుడు సాదుద్దీన్ కస్టడీ ఆదివారంతో ముగిసింది. సోమవారం ఉదయం అతనికి వైద్యపరీక్షలు చేయించి, చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. ఈ కేసులో సాదుద్దీన్ అందించిన సమాచారంతోపాటు.. మైనర్ల విచారణలో పలు అంశాలను గుర్తించారు. సాదుద్దీన్ ఘటన జరిగిన క్రమాన్ని వివరించగా.. పోలీసులు మైనర్ నిందితులతో సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ చేయించారు. మూడున్నర కిలోమీటర్ల పరిధిలోనే మొత్తం ఘటన జరిగిందని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. సాదుద్దీన్‌ను ఓ బృందం ప్రశ్నిస్తుండగా.. మరో బృందం మైనర్లను ఓ బస్సులో సీన్ రీ-కన్‌స్ట్రక్షన్‌కు తీసుకెళ్లారు. అనంతరం మైనర్లను జువెనైల్ హోంకు తరలించారు.
కీలక వాగ్మూలం : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో ముగ్గురు మైనర్ల కస్టడీ మంగళవారానికి, మరో ఇద్దరి కస్టడీ బుధవారానికి ముగియనుంది. ఇప్పటి వరకు పోలీసులు వారి నుంచి కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. ముఖ్యంగా ఈ ఘటనకు ముఖ్య కారణంగా వారు సాదుద్దీన్, కార్పొరేటర్ కుమారుడి పేర్లు చెప్పినట్లుసమాచారం. వారిద్దరే తమను రెచ్చగొట్టి.. రేప్‌కు ఉసిగొల్పారని వివరించినట్లు తెలుస్తోంది. ‘‘ఆ అమ్మాయి పరువుకు భయపడి అత్యాచారం విషయాన్ని బయటకు చెప్పదు. భయపడాల్సిన పనిలేదు. అని వారు చెబితేనే మేమూ అత్యాచారంలో భాగస్వాములయ్యాం. ఇలా జైలుపాలవుతామని ఊహించలేదు. నిజానికి మేము ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించలేదు. బాలికపట్ల మొదటి నుంచి అమానుషంగా ప్రవర్తించింది.. ఆమెను మొదటగా రేప్ చేసింది కార్పొరేటర్ కుమారుడే. ఆ తర్వాత సాదుద్దీన్ రేప్ చేశాడు’’ అని వారు వాంగ్మూలమిచ్చినట్లు తెలిసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gang rape, Hyderabad, Hyderabad police, Jubilee Hills Gang rape case