సోషల్ మీడియాలో క్లాస్మేట్ అసభ్యకర ఫొటోలు పోస్టు చేసిన ఓ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. నిందితుడు, బాధిత యువతి ఇద్దరు నగరంలోని ఒకే కాలేజ్‌లో ఇంజనీరింగ్ చదవుతున్నారు. 2020 ప్రారంభంలో నిందితుడు బాధితురాలికి ఆమె మార్ఫ్డ్ ఫొటోలు పంపించాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. తనకు న్యూడ్ వీడియో కాల్ చేయాల్సిందిగా ఒత్తిడి తెచ్చాడు. అయితే నిందితుడు మార్ఫ్డ్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడేమోనన్న భయంతో బాధితురాలు.. అతడికి వీడియో కాల్ చేసింది. అయితే నిందితుడు ఆ కాల్‌ను రికార్డు చేయడంతో పాటుగా స్క్రీన్ షాట్లు కూడా తీశాడు.
ఇక, గతేడాది అక్టోబర్ నుంచి బాధిత యువతి వేరే వ్యక్తితో క్లోజ్‌గా ఉండటం నిందితుడు తట్టుకోలేక పోయాడు. దీంతో వెళ్లి ఆమెను ప్రశ్నించాడు. దీంతో బాధిత యువతి "నువ్వంటే నాకు ఇష్టం లేదు" అని నిందితుడికి చెప్పింది. దీంతో నిందితుడు.. బాధిత యువతిపై కోపాన్ని పెంచుకున్నాడు. ఆమెపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆమె సెమీ న్యూడ్ ఫొటోలను టెలిగ్రామ్ గ్రూప్స్‌లో పోస్ట్ చేశాడు. అలాగే ఆమె ఫోన్ నెంబర్‌ను కూడా షేర్ చేశాడు.
ఈ విషయాన్ని గుర్తించిన బాధిత యువతి.. రాచకొండ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. అయితే నిందితుడు తన ఫోన్లో నుంచి, టెలిగ్రామ్ యాప్‌లో నుంచి ఆ ఫొటోలను డిలీట్ చేశాడు. అయితే డేటాను విశ్లేషించిన పోలీసులు ఆదివారం నిందితుడిని అరెస్ట్ చేశారు.