HUSBAND PHONE CALL TO DIAL 100 AFTER HE KILLED HIS WIFE IN MAHABUBABAD HERE IS FULL DETAILS HSN
నా భార్యను నేనే చంపా.. వచ్చి అరెస్ట్ చేసుకోండి.. అంటూ డయల్ 100కు భర్త ఫోన్.. అసలేం జరిగిందంటే..
ప్రతీకాత్మక చిత్రం
’నేను నా భార్యను చంపేశా. ఆమె చనిపోయింది. నేను కూడా చావడానికి సిద్ధం. త్వరగా వచ్చి నన్ను అరెస్ట్ చేసుకోండి. ఇక్కడే ఉంటా. ఎక్కడికీ వెళ్లను. అడ్రస్ చెబుతున్నా రాసుకోండి‘ అంటూ పోలీసులకు ఫోన్ చేసి మరీ చెప్పాడు. ఇంతకీ అసలేం జరిగిందంటే..
ఫిబ్రవరి 15వ తారీఖు, సోమవారం. 100 సర్వీసుకు ఓ ఫోన్ వచ్చింది. మీకేం సాయం కావాలో చెప్పండి అంటూ అడిగారు. కానీ అవతల ఫోన్ చేసిన వ్యక్తి మాత్రం ఓ దారుణ నిజాన్ని వెల్లడించాడు. ’నేను నా భార్యను చంపేశా. ఆమె చనిపోయింది. నేను కూడా చావడానికి సిద్ధం. త్వరగా వచ్చి నన్ను అరెస్ట్ చేసుకోండి. ఇక్కడే ఉంటా. ఎక్కడికీ వెళ్లను. అడ్రస్ చెబుతున్నా రాసుకోండి‘ అంటూ అతడు బాంబుపేల్చాడు. తాను ఎక్కడ ఉన్నది ఆనవాళ్లతోసహా చెప్పాడు. భార్యపై అనుమానంతోనే ఈ దారుణానికి ఒడిగట్టాడు. 12 ఏళ్లు తనతో కాపురం చేసిన భార్యను కడతేర్చాడు. ఇద్దరు కూతుళ్లకు తల్లిని లేకుండా చేశాడు. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండకు చెందిన కొండబత్తుల నరేష్ కు మొదటి భార్యతో విడాకులు అయ్యాయి. దీంతో 12 ఏళ్ల క్రితం చిననగూడూరు మండలం జయ్యారానికి చెందిన సరితతో 12 ఏళ్ల క్రితమే పెళ్లయింది. ఈ దంపతులకు 10 ఏళ్ల సిరివెన్నెల, ఆరేళ్ల మేఘన అనే కూతుళ్లు ఉన్నారు. నరేష్ డీసీఎం వ్యాన్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. అయితే కొద్ది నెలలుగా భార్యపై నరేష్ అనుమానం పెంచుకున్నాడు. ఎవరితోనో వివాహేతర సంబంధం నడుపుతున్నావంటూ గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం సరితతో గొడవ పడ్డాడు. ఈ గొడవలో ఆమె తీవ్రంగా గాయపడింది. దీంతో సరిత పిల్లలతో సహా తన పుట్టింటికి వెళ్లిపోయింది.
సోమవారం నరేష్ జయ్యారంలో ఉంటున్న తన భార్య వద్దకు వెళ్లాడు. ఇకపై మంచిగా ఉంటానని మాయమాటలు చెప్పి చిన్నకూతురు మేఘన, భార్య సరితతో కలిసి మహబూబాబాద్ కు వచ్చాడు. అక్కడి నుంచి బైక్ పై బయ్యారం మండలం నామాలపాడు అటవీ ప్రాంతానికి చేరుకున్నాడు. ముందుగా అనుకున్నట్టే కూతురిని కాస్త దూరంగా ఉంచి భార్యను కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత డయల్ 100కు ఫోన్ చేసి చెప్పాడు. ’నా భార్యను నేనే చంపేశా. వచ్చి అరెస్ట్ చేసుకోండి. నన్ను ఉరి తీసుకోండి. నేనెక్కడికీ పారిపోను. ఇక్కడే ఉంటా‘ అంటూ నరేష్ తేల్చిచెప్పాడు. అన్నట్టుగానే పోలీసులు వచ్చేవరకు అక్కడే ఉన్నాడు. పోలీసులు వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.